ASER 2022 Report: బీహార్ కంటే తెలుగు రాష్ట్రాలు వెనుకంజ – ఎందుకీ దుస్థితి..
ASER report reveals serious learning loss among indian Government Schools
మన దేశంలో విద్యావ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయం వార్షిక విద్యా సర్వే ద్వారా వెల్లడయింది. ఈ సర్వేలో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. కరోనా కారణంగా కొంత కాలంగా ఇబ్బంది పడ్డ భారత విద్యావ్యవస్థ తిరిగి గాడిన పడిందా లేదా అనే విషయాలు ఈ సర్వే ద్వారా వెల్లడయింది. విద్యార్ధుల్లో పఠనా సామర్ధ్యం, చిన్న చిన్న లెక్కలు చేసే సామర్ధ్యం చాలా వరకు తగ్గినట్లు సర్వేలో వెల్లడయింది. ఈ సర్వే నివేదిక చాలా మంది విద్యా వేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
తొలి విద్యా సర్వే 2005లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తూ వచ్చారు. మళ్లీ 2022లో నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ సర్వేలో అనేక విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి.
ప్రథమ్ ఫౌండేషన్ చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల పాటు బడులు మూతబడినా 2022లో మాత్రం విద్యార్ధుల చేరికలో మాత్రం తగ్గుదల కనిపించలేదు. 6 నుంచి 14 ఏళ్ల లోపు వయసు కలిగిన విద్యార్ధులు 98.4 శాతం మంది 2022లో పాఠశాలల్లో చేరారు. ఈ సంఖ్య 2018లో 97.2 శాతంగా
ఉంది.
2022లో దేశంలోని 616 జిల్లాల్లో 19,060 గ్రామాల్లో విద్యా సర్వే చేపట్టారు. దేశ వ్యాప్తంగా 3,74,544 ఇళ్లల్లో 6,99,597 మంది విద్యార్ధులను అనేక విషయాలపై ప్రశ్నించారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఆ విధంగా 2022 సర్వే నిర్వహించారు. అనేక విషయాలపై స్పష్టత పొందారు. జనవరి 18న తమ నివేదికను
బహిర్గతం చేశారు.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు సర్వేలో తేటతెల్లం అయింది. బీహార్, పంజాబ్ రాష్ట్రాల కన్నా చాలా విషయాల్లో వెనకబడి ఉన్నట్లు తేలింది. ఇంకా బడి ముఖం చూడని విద్యార్ధుల సంఖ్య 18 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 8వ తరగతి విద్యార్ధి 2వ తరగతికి చెందిన భాగాహారం లెక్కలను చేయలేని స్థితిలో ఉన్నట్లు ఈ విద్యాసర్వే ద్వారా తెలిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాఠశాలల్లో త్రాగు నీటి సౌకర్యం, టాయిలెట్ల సౌకర్యం అత్యంత దారుణంగా ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసింది. తమ సౌకర్యాలు, జీతాల పెంపు, డీఏల పెంపులపై పోరాటాలకు దిగుతున్న అనేక ఉపాధ్యాయ సంఘాలు విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు అందించే విషయమై అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం ఈ సర్వే ద్వారా మరోసాకి తేటతెల్లం అయింది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువుగా ఉంది. ఎందరో రాజకీయ నాయకులు అనర్ఘళంగా ప్రసంగాలు చేయగలరు. ప్రత్యర్ధులపై పదునైన మాటలతో దాడికి దిగగలరు. అటువంటి రాజకీయ నాయకులు కనీసంలో కనీసం విద్యావ్యవస్థ బాగోగులపై ఫోకస్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఏపీలో చాలా మంది విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్ లు అందించారు. అక్కడితో సరిపెట్టారు. విద్యార్ధులకు ఏ స్థాయిలో విషయాలు అర్ధం అవుతున్నాయో అనే విషయం ఇటు టీచర్లకు అటు ప్రభుత్వాలకు పట్టడం లేదు. దీంతో ఒక్కో క్లాస్ పైకి వెళుతున్నప్పటికీ వారిలో విషయం ఉండడం లేదు.
8వ తరగతికి చెందిన కొందరు విద్యార్ధులు రెండో తరగతికి చెందిన పాఠ్యాంశాలను చదవే స్థాయిలో లేరని స్పష్టంగా తెలిసింది. రెండో తరగతి పాఠ్యాంశాలను చదవగలిగే 8వ తరగతి విద్యార్ధుల సంఖ్య 2018లో 27.3 శాతం ఉంటే 2022లో ఆ సంఖ్య 20.5 శాతానికి పడిపోయింది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
2018లో కేరళలో పాఠశాల్లో మూడో తరగతి విద్యార్ధుల్లో పఠన సామర్ధ్యం 52.1 శాతం ఉండేది. ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. 2022 నాటికి 38.7 శాతానికి దిగజారింది. విద్యాప్రమాణాల్లో ఎంతో మెరుగ్గా ఉండే కేరళలో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా పఠన శక్తి క్రమ క్రమంగా తగ్గిపోయింది. 2018లో మూడో తరగతి విద్యార్ధుల్లో పఠన శక్తి 47.7 శాతంగా ఉండేది. ఆ సంఖ్య 2022 నాటికి 28.4 శాతానికి పడిపోయింది. అదే విధంగా హర్యానా రాష్ట్రంలో కూడా విద్యార్ధుల పఠనా శక్తి తగ్గిపోయింది. గత నాలుగేళ్లలో 46.4 శాతం నుంచి 31.5 శాతానికి పడిపోయింది.