ASER 2022 : తెలుగు రాష్ట్రాల్లో పతనం అంచున విద్యా వ్యవస్థ..విస్తుపోయే వాస్తవాలు
ASER 2022 Reveals the Actual status for School Education and Skill in the students: విద్యారంగం కోసం వేల కోట్ల నిధులు. ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలు. లక్షల మంది ఉపాధ్యాయులు. కానీ, ఫలితం ఏంటి. రేపటి తరం కు అందుతున్న చదువు..నేర్చుకుంటున్న విద్య ఏంటంటే విస్తుపోయే నిజాలు అంగీకరించాల్సిందే. ASER 2022 నివేదికలో మన పాఠశాల విద్య ఎంత దారుణ పరిస్థితుల్లొ ఉందో స్పష్టం అవుతుంది. విద్యార్ధులు కనీసం తెలుగు అక్షరాలు గుర్తించలేకపోతున్నారు. లెక్కంటే బిక్కపోయి చూస్తున్నారు. అంకెలంటే తెలయదు. ప్రతీ ఏటా బడ్జెట్ లో చూపిస్తున్న వేల కోట్లతో సాధిస్తుంది ఏంటి. పిల్లలు నేర్చుకుంటుంది ఏమీ లేదు. విద్యా బోధన చేసే టీచర్ల ఆలోచనల్లోనూ మార్పు లేదు. ఈ నివేదికలకు ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయి.
ప్రభుత్వ పాఠశాలల తీరు అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవటం మినహా విద్యార్ధులకు అక్షరం ముక్క రావటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని ఈ నివేదిక బయట పెట్టింది. రెండు రాష్ట్రాల్లో తెలుగు మాతృ భాష. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్దులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పరిశీలన చేయగా, పోటీలో బాగా వెనుకబడి ఉన్నారు. అసలు తెలుగు అక్షరాలే గుర్తించ లేకపోతున్నారు. తాము మాట్లాడే భాషలోనే పదాలు గుర్తించటం..పలకటం కష్టంగా ఫీలవుతున్నారు. తెలుగు కంటే కొంత మెరుగ్గా ఇంగ్లీషులో పదాల వరకు చెబుతున్నట్లుగా సర్వేలో గుర్తించారు. మూడవ తరగతి చదివే విద్యార్ధులకు ఒక వ్యాఖ్యం పూర్తిగా చదవలేని పరిస్థితి. పదం పదం కూడబలుక్కున్న స్పష్టంగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. తెలుగు ఇంగ్లీషులో మాత్రమే కాదు.
అసలు 99 వరకు అంకెలను గుర్తించలేని స్థితిలో వీరు ఉన్నారు. 8వ తరగతి చదివే విద్యార్ధులకు తీసివేతలు రావని గుర్తించారు. భాగాహారాలు అంటే ఆకాశంలోకి చూస్తున్నారు. సులువైన పదాలను పలకటంలో 8వ తరగతి పిల్లలు వెనుకబడి ఉన్న అంశాన్ని ఈ ఏఎస్ఈఆర్ నివేదిక బయట పెట్టింది. ఇదే 8వ తరగతి చదువుతున్న విద్యార్ధుల్లో చిన్న చిన్న ఆంగ్ల పదాలను చదవి వాటికి అర్దాలు చెప్పలేని పరిస్థితి సర్వే సంస్థ గుర్తించింది. పాఠశాలల్లో మౌళిక వసతులు తక్కువే. తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేని పాఠశాలలు 20 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇక..విద్యార్ధులకు అవసరమైన లైబ్రేరీలు, కంప్యూటర్లు లేని పాఠశాలలు 76 శాతం ఉన్నట్లుగా తేల్చారు. విద్యార్ధులకు ఆట పాటల కోసం దాదాపు 20 శాతం బడుల్లో పీఈటీలే లేరని సర్వే తేల్చింది.
ఇదే నివేదిక మరో ఆసక్తి కర అంశాన్ని బయట పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అత్యధిక మంది విద్యార్ధులు ప్రయివేటు ట్యూషన్లకు వెళ్తున్నారు. దాదాపుగా 30 శాతం మంది విద్యార్ధులు ప్రభుత్వ బడుల్లో చెప్పే దాని కంటే ప్రయివేటు ట్యూషన్లకు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం గణనీయంగా పడిపోయింది. నాలుగేళ్ల కాలంలో స్థానం దిగజారిందని నివేదిక తేల్చి చెబుతోంది. తరుగతులు పాసయి పై క్లాసులకు వెళ్లిన విద్యార్ధులు తాము చదివి పాసయిన క్లాసులకు సంబంధించిన పాఠాలను తిరిగి చదవలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం బాగా తక్కువగా ఉందని సర్వే గుర్తించింది. మొత్తంగా 72 శాతం మంది మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. కానీ, హాజరు శాతం మాత్రం లెక్కల ప్రకారం బాగానే కనిపిస్తోంది.