Bangalore: బెంగళూరులో దారుణం ప్రేమోన్మాది చేతిలో బలైన యువతీ
Bangalore: మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. తాజాగా కర్ణాటకలో ప్రేమోన్మాది చేతిలో మరో యువతీ తనువు చాలించింది. బెంగళూరులో 28 ఏళ్ల యువకుడు తన ప్రేయసిని కత్తితో పొడిచాడు. నిందితుడు తన ప్రియురాలిని 16 సార్లు కత్తితో పొడిచి చంపాడని పోలీసు అధికారులు తెలిపారు. తూర్పు బెంగళూరులోని ఆమె కార్యాలయం వెలుపల నిందితుడు.. బాధితురాలిని అందరిముందే కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు.
ఈ దారుణానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బెంగుళూరులోని మురుగేశ్‌పాల్య ఏరియాలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన లీలా పవిత్ర బెంగళూరులోని మురుగేశ్‌పాల్యలో ఉన్న ఒమెగా హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తోంది. శ్రీకాకుళానికి చెందిన దినకర్ కూడా దొమలూరులో ఓ హెల్త్‌కేర్ సంస్థ లోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి ప్రేమ సంగతి లీలా తన ఇంట్లో చెప్పగా పెళ్లికి వారు నిరాకరించారు.
కుటుంబ సభ్యులను బాధపెట్టడం ఇష్టం లేక లీలా.. గత రెండు నెలలుగా దివాకర్‌ను పక్కనపెడుతూ వచ్చింది. ఇదే సమయంలో ఆమెకు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. ఇందుకు లీలా పవిత్ర ఒప్పుకోవడంతో.. విషయం తెలుసుకున్న దివాకర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. విధులు ముగించుకొని బయటకు వచ్చిన లీలపై దివాకర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.