Anant- Radhika Engagement: నేడే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం
Anant- Radhika Engagement: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం ఈరోజు సాయంత్రం జరగనుంది. ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం – యాంటిలియాలో ఈ కార్యక్రమం జరుగనుంది. అంగరంగ వైభవంగా ఈ వేడుకని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకకు కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం. ఈ వేడుకకు హాజరయ్యే వారిని భారత సంప్రదాయ దుస్తుల్లో హాజరవ్వాలని కోరారట. ఈరోజు సాయంత్రం 7 గంటలకు నిశ్చితార్థం జరగనుంది. మంగళవారం వీరి మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధికా మర్చంట్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్లు అబి జానీ, సందీప్ ఖోస్లా మెహెందీ వేడుక కోసం తీర్చిదిద్దారు.
అనంత్, రాధిక ఒకరికొకరు చాలా కాలంగా పరిచయస్తులే. ఇక అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఈవెంట్‌లోనూ రాధిక కనిపిస్తుంది. రాధిక మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్ మరియు శైలా మర్చంట్ కుమార్తె. రాధిక తండ్రి వీరేన్ కూడా దేశంలోని సంపన్న వ్యక్తులలో ఒకరు. రాధిక తన పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేసింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లింది.