Amit Shah: హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం..కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు
An Unknown Car entered Amit Shah’s Convoy
హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. త్రిపుర పర్యటనలో ఉన్న అమిత్ షా.. ఆ రాష్ట్ర రాజధాని అగర్తలలో నిన్న రాత్రి బస చేశారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయలుదేరి విమానాశ్రయానికి వెళ్తుండగా.. అదే సమయంలో ఓ ప్రైవేట్ వాహనం హోంమంత్రి కాన్వాయ్‌పైకి దూసుకెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. అమిత్ కాన్వాయ్ లోకి దూసుకువచ్చిన వాహనం త్రిపుర రాష్ట్రానికి చెందినదేనని పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.
6 నెలల క్రితం అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా కాన్వాయ్ ఆగిపోవలసి వచ్చింది. భారత రాష్ట్ర సమితికి చెందిన ఓ నేత అమిత్ షా కాన్వాయ్ వస్తున్న దారిలో ఓ వాహనాన్ని పార్క్ చేశాడు. దూరం నుంచే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. వాహనాన్ని వెంటనే అడ్డు తొలగించారు.
కొన్ని నెలల క్రితం ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా కూడా కొంత ఇబ్బంది తలెత్తింది. ప్రధాని నరేంద్ర మోడీ వెళుతున్న మార్గంలో కొందరు ఆందోళన కారులు నిరసనకు దిగారు. ఆ సమయంలో కూడా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రధాని వెళుతున్న మార్గాన్ని క్లియర్ చేశారు.