Amit Shah: తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరాలి ..అమిత్ షా
Amit Shah: తెలంగాణ లో బీజేపీ జెండాను ఎగురవేయాలని రాష్ట్రనేతలకు కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయాలని చెప్పారు. వ్యక్తిగత అజెండాలు ఏమైనా ఉంటే పక్కనపెట్టాలన్నారు. 15 రోజులకోసారి భేటీ అవుతానని పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో అన్నారు. కొద్దీ రోజులుగా ప్రచారమవుతున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని ఆయన నేతలకు తెలిపారు. బండి సంజయ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని దానిని మరింత పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచించారు.
శక్తి కేంద్రాల స్థాయిలో సమావేశాలు మంగళవారంతో ముగిసినందున తదుపరి దశలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, అనంతరం ఉమ్మడి జిల్లా స్థాయిలో బహిరంగసభలు నిర్వహించాలని ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో భారీ సభ నిర్వహించాలని సూచించింది. భవిష్యత్తు వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ప్రతి 10 రోజులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ కూర్చుని సమీక్షించుకోవాలని సూచించారు. తెలంగాణలో అధికార పార్టీ పాలనను ఎండగట్టి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అమిత్ షా తెలిపారు.