Parliament Session: ఈనెల 17న అఖిలపక్ష సమావేశం
All Party Meeting on 17th July: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జులై 17 అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయను న్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీ ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జులై 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాల గురించి ఈ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించనున్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలను కోరనున్నారు.
పార్లమెంట్ సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. భారత రాష్ట్రపతికి ఎన్నిక జూలై 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే జరుగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6 జరగనుంది. రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారి కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సమావేశాల్లోనే రెండు రాజ్యాంగ పదవులకు సంబంధించిన కౌంటింగ్ కూడా పార్లమెంట్లోనే జరుగనుంది. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గతంలోనే వెళ్లడించారు.