Akhilesh Yadav Refuses Tea: పోలీసుల చాయ్‌కి నో చెప్పిన అఖిలేష్…
Akhilesh Yadav Refuses Tea: ఉత్తర ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్‌లో ఓ వింత చోటు చేసుకున్నది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులను పెట్టారని చెప్పి సమాజ్‌వాదీ పార్టీ ఆఫీస్ బేరర్ మనీష్ జగన్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లక్నోలోని పోలీస్ హెడ్ క్వార్టర్‌కి చేరుకున్నారు. అక్రమ అరెస్ట్‌కు నిరసిస్తూ, పార్టీ నేతలను విడిపించుకునేందుకు వెళ్లారు. కాగా, లక్నో పోలీస్ కార్యాలయానికి వచ్చిన అఖిలేష్ యాదవ్‌కు మర్యాదపూర్వకంగా పోలీసులు టీని అందించారు.
అయితే, పోలీసులు అందించిన ఆ చాయ్‌ని తిరస్కరించారు. అందులో విషం కలిపారేమోననే సందేహాన్ని వెలుబుచ్చారు. పోలీసులు అందించే టీ తనకు అవసరం లేదని, బయటనుండి తెప్పించిన టీ తాగుతానని పేర్కొన్నారు. దీంతో పోలీసులు బయటనుండి టీని తెప్పించి అందించారు. తాను పోలీస్ కార్యాలయానికి వస్తే అక్కడ ఉన్నతాధికారులు లేరని, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఇలా ఉంటే, మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని అన్నారు. కాగా, దీనిపై లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ స్పందించారు. ఆదివారం కావడంతో అవసరమైన మేరకే సిబ్బంది కార్యాలయాలకు వస్తారని, తాను కార్యాలయ సిబ్బందితో మాట్లాడానని, అఖిలేష్ యాదవ్ టీ తాగారని అన్నారు. అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.