Akhilesh 2024 plan: బీజేపీకి చెక్ పెట్టేందుకు… కాంగ్రెస్‌కు షాకివ్వనున్న అఖిలేష్
Akhilesh 2024 plan: వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు దేశంలోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నాయి. అధికార బీజేపీని ఓడించేందకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పిలుపునిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ లేకుండానే కొన్ని పార్టీలు జట్టుకట్టాలని చూస్తున్నారు. అలాంటి పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ముందు వరసలో ఉన్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు. అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు పలికిందని మమతా బెనర్జీ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగబోమని సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించింది.
అంతేకాకుండా, తమతో చేతులు కలిపే వారితో మూడో పక్షంగా ఏర్పడేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను తృణమూల్ అధినేత్రి కలిశారు. తృణమూల్‌తోనే నడవాలని ఆయనకూడా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లైయింది. ఉత్తర భారతదేశంలో టీఎంపీ, ఎస్పీ పార్టీలు బలమైన పార్టీలు ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే బీజేపీకి లాభం చేకూరుతుంది. బీజేపీ విజయానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. త్వరలోనే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒడశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్నారు. ఆయన మద్దతు కోరనున్నారు.