Manish Sisodia: మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీ పొడిగింపు, మరో 5 రోజుల పాటు రిమాండ్
5 days ED remand for manish Sisodia
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తన దూకుడు కొనసాగిస్తోంది. మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీ మరో 5 రోజుల పాటు కోర్టు పొడిగించింది. ఈడీ అధికారులు వారం రోజుల కస్టడీ పొడిగింపు కోరారు. కోర్టు మాత్రం 5 రోజుల పొడిగింపు మంజూరు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈడీ విచారణను తప్పుబడుతున్నారు. రోజుకు అర్ధగంట నుంచి గంట వరకు మాత్రమే సిసోడియాను ప్రశ్నిస్తున్నారని, అటువంటప్పుడు జైలులో ఉంచాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 26 నుంచి మనీశ్ సిసోడియా జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు ఆ రోజున విచారణ జరిపి అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఈడీ అధికారులు కూడా సిసోడియాను విచారణ చేశారు. వారి ఆధీనంలోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు ప్రశ్నించిన అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. కోర్టు 5 రోజులకు మాత్రమే అనుమతిచ్చింది.
సిసోడియాను విచారించిన ఈడీ అనేక విషయాలను వెల్లడించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకి ఫిర్యాదు చేసిన రోజే సిసోడియా కొన్ని సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ గుర్తించింది. సిసోడియా ఉపయోగించిన ఫోన్ వేరే వారి పేరు మీద ఉందని, ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం చేసిన పనేనని ఈడీ తెలిపింది.