Manipur: హింసతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతోంది. దాదాపు రెండు నెలలుగా హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Manipur: హింసతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతోంది. దాదాపు రెండు నెలలుగా హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీల్లో చేర్చాలని మైతేయిలు డిమాండ్ చేయడం.. అందుకు కుకీ తెగ వారు వ్యతిరేకించడంతో మొదలైన వివాదం పెను విధ్వంసానికి దారి తీసింది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయనుకునే సమయంలో మళ్లీ హింస చెలరేగుతోంది. తిరుగుబాటు దారులు రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేస్తున్నారు. శుక్రవారం తిరుగుబాటుదారులు మరో ముగ్గురిపై కాల్పులు జరిపారు.
ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దులోని ఖొకెన్ గ్రామంలోకి కొందరు తిరుగుబాటు దారులు భద్రతా సిబ్బంది దుస్తుల్లో ప్రవేశించారు. తనిఖీల పేరుతో ఇంట్లో ఉన్న వారిని బయటకు పిలిచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్ధం విని వెంటనే అస్సాం రైఫిల్స్ భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకునేలోగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం భద్రతా సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇకపోతే మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగారు. రెండు తెగల మధ్య సమస్వయాన్ని కుదిర్చి శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా మణిపూర్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు మణిపూర్‌లో శాంతిభద్రతలను పరిశీలించారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఇటీవల కూడా తిరుగుబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోగా.. అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇప్పటి వరకు మణిపూర్‌లో చెలరేగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 300 మందికిపైగా గాయాలపాలయ్యారు.