Droupadi Murmu : రాష్ట్రపతిగా నేడు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
New President of India:భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.ఉదయం 8.30 గంటలకు రాజ్ ఘాట్ లో జాతిపిత మహాత్మ గాంధీ కి నివాళులు అర్పించి ఆతర్వాత తన నివాసానికి తిరిగి వెళ్ళి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు 9.22 గంటలకు వెళ్తారు.
అనంతరం సైనికులు.. ముర్ముకు సైనిక వందనం స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమానికి ముందు ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అలాగే నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ముర్ము పార్లమెంటుకు వస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో కార్యక్రమం ముగిసిన తర్వాత.. ముర్ము రాష్ట్రపతి భవన్కు పయనమవుతారు.బీజేపీయేతరుల ముఖ్యమంతుల్లో ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితురులు హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమానికి ముర్ము కుటుంబం నుంచి నలుగురు మాత్రమే కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముర్ము సోదరుడు, వదిన, కూతురు- అల్లుడు ఈ కార్యక్రమానికి రానున్నట్లు సమాచారం. పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం అనంతరం, సంప్రదాయరీతిలో అశ్వ శకటం పై అధికార లాంఛనాలతో రాష్ట్రపతి భవన్కు 10.57 గంటలకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి పీఠమెక్కుతున్న తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు.