Bhagwant Mann: ఏకంగా సీఎం నివాసానికే పది వేల ఫైన్!
10,000 Fine to Bhagwant Mann Residence: రోడ్డుపై చెత్త విసిరినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికారిక నివాసానికి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.10,000 జరిమానా విధించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్జీందర్ సింగ్ పేరు మీద ఈ చలాన్ జారీ చేయబడింది. అయితే చలాన్లో పేర్కొన్న ఇంటి చిరునామా: ఇంటి నెం-7, సెక్టార్-2, చండీగఢ్ అంటే అది సీఎం నివాసం అని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ స్థానిక కౌన్సిలర్ మహేశీందర్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసంలోని ఉద్యోగులు ఇంటి నెంబరు-7 వెనుక చెత్త వేస్తున్నారని కొంతకాలంగా నివాసితుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇంటి బయట చెత్త వేయొద్దని మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆపలేదన్నారు. అందుకే చలాన్ జారీ చేసినట్లు తెలిపారు. ఇంటి నంబర్లు 44, 45, 6, 7 ముఖ్యమంత్రి నివాసంలో భాగమని మహేశీందర్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఇక కొన్నాళ్ల క్రితమే ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భగవంత్ మాన్ సీఎంగా ఎంపికయ్యారు.