MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరం
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తున్న క్రమంలో ఈ మేరకు వాటికి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికల తేదీలు ఖరారు చేశారు.
ఏపీలో పదవీకాలం ముగుస్తున్న వారి జాబితాలో నారా లోకేశ్, చల్లా భగీరథ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీపీ సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఇక తెలంగాణలో పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీల జాబితాలో ఎలిమినేట్ కృష్ణారెడ్డి, వి. గంగాధర్ గౌడ్, కుర్మయ్యగారి నవీన్ కుమార్ ఉన్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 6న నోటిఫికేషన్ వెలువడనుండగా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 13గా ఉండనుంది. ఇక నామినేషన్ల పరిశీలన మార్చి 14న జరగనుండగా పోలింగ్, కౌంటింగ్ మార్చి 23వ తేదీన ఉండనుంది.
ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటాలో తమ అభ్యర్ధులను ప్రకటించింది. తెలంగాణలో అశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రోజు లేదా రేపు అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కానున్నాయి. సమావేశాల సమయంలోనే పోలింగ్ జరగనుంది. ఏపీలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఎమ్మెల్యే కోటా సీట్లు వైసీపీ ఖాతాలో చేరనున్నాయి. అదే విధంగా తెలంగాణలో సీట్లు బీఆర్ఎస్ కు దక్కటం లాంఛనంగా కనిపిస్తోంది.