Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెండు కమ్యూనిటీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు చక్క బడుతున్నాయి.
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెండు కమ్యూనిటీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు చక్క బడుతున్నాయి. ఈక్రమంలో మణిపూర్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు (MLA) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) నేతృత్వంలోని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంపై (Manipur government) ప్రజలు విశ్వాసం కోల్పోయారని చిన్-కుకి-మిజో-జోమి-హ్మార్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. పునరావాసాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందనే నమ్మకం ప్రజల్లో పూర్తిగా పోయిందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
ఢిల్లీలో ఇటీల జరిగిన ఓ సమావేశానికి బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, కుకీ పీపుల్స్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మొత్తం 10 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు మూడు పేజీల లేఖను అందజేశారు. మణిపూర్‌లో నెలకొన్న అశాంతి గురించి అమిత్ షాకు ఎమ్మెల్యేలు లేఖ ద్వారా తెలియజేశారు. హింస చెలరేగిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను షాకు తెలియజేశారు. అలాగే కుకి గిరిజనలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని.. రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యేలు లేఖలో అమిత్ షాను కోరారు.
ఇకపోతే మే 3న మణిపూర్‌లో మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చడాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళన హింకు దారి తీసింది. ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారుల దాడుల్లో వాహనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. హింసను కట్టడి చేసేందుకు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. మణిపూర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ను బ్యాన్ చేశారు. ఆ సమయంలో అమిత్ షా కూడా స్పందించారు. మణిపూర్‌లో హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి తిరుగులేని మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు.