Rajasthan Congress: కర్ణాటకలో గెలిచిన సంబరాల వేళ కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ మొదలైంది. రాజస్థానంలో గెహ్లోత్ వర్సస్ పైలెట్ రాజకీయం పతాక స్థాయికి చేరింది. కర్ణాటకలో నాయకులంతా సమిష్టిగా ాపర్టీని గెలిపించిన విషయాన్ని అధినాయకత్వం గుర్తు చేస్తోంది. ఇదే సమయంలో గెహ్లోత్ ను ఇరుకున పెట్టేలా పైలెట్ కొత్త డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు. తన డిమాండ్ ను సీఎం పట్టించుకోవటం లేదంటూ పైలెట్ కొత్త అల్టిమేట్ జారీ చేసారు. గెహ్లోత్ ప్రభుత్వానికి రోజుల సమయం ఇచ్చారు. తాను కోరుతున్న విధంగా 15 రోజుల్లో గతంలో బీజేపీ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని పైలట్ డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
రాజస్ధాన్ లో ఇప్పుడు మరోసారి గెహ్లోత్ వర్సస్ పైలెట్ పోరు కాంగ్రెస్ కు కొత్త తల నొప్పులు తెచ్చి పెడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా జైపూర్ నుంచి సచిన్ పైలట్ చేపట్టిన జన సంఘర్షణయాత్ర ముగిసింది. మహాపూర్లో యాత్రను ముగించారు పైలట్. తన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదని, అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే అని స్పష్టం చేశారు సచిన్ పైలట్. ఎన్నికల్లో బీజేపీ అవినీతిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చామని, కానీ ఇప్పటివరకు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఇదే సమయంలో 15 రోజుల్లో గతంలో బీజేపీ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని పైలట్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడుతామని సీఎం గెహ్లాట్‌ను హెచ్చరించారు. వసుంధరారాజే సర్కార్ చేసిన అవినీతిపై విచారణ జరపాలని ఐదేళ్ల నుంచి ఉద్యమిస్తునప్పటికి సీఎం పట్టించుకోవడం లేదంటూ నేరుగా ముఖ్యమంత్రి గెహ్లోత్ ను టార్గెట్ చేసారు.
పైలట్ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలి రావటంలో ఇప్పుడు హైకమాండ్ దిక్కు తోచని స్థితిలో ఉంది. రాజస్థాన్ లో మహాపురలో పైలెట్ యాత్ర నిర్వహించారు. పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన నేతలు, కేడర్ సంఘీభావం ప్రకటించారు. గత కొంతకాలంగా సొంత పార్టీపై గుర్రుగా ఉన్న సచిన్ పైలట్ వ్యక్తిగతంగా జన్ సంఘర్ష్ యాత్ర చేపట్టారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటును చల్లార్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు చేపట్టింది. పార్టీ నేతలు ఐకమత్యంతో పనిచేయడం తోనే కర్నాటకలో విజయం సాధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఇటు సీఎం అశోక్ గెహ్లాట్‌కు, అటు సచిన్ పైలట్‌కు హైకమాండ్ సూచిస్తోంది. ప్రస్తుతం హైకమాండ్ కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక..అక్కడ సమస్యలు లేకుండా ప్రభుత్వ నిర్వహణ పైన పూర్తిగా నిమగ్నమైంది.
గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపడంతో పాటు మరో 2 ప్రధాన డిమాండ్లు బయటపెట్టారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేయాలని.. పేపర్ లీకుల కారణంగా ఉద్యోగ పరీక్షలు రద్దయి నష్టపోయిన అభ్యర్థులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మూడు ప్రధాన డిమాండ్లపై నెలాఖరులోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని పైలెట్ స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక రోజు నిరాహార దీక్ష, పాదయాత్ర చేశానని, తన డిమాండ్లపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదన్నారు. తనకు పదవి ఉన్నా.. లేకపోయినా.. తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడతానన్నారు. ‘ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని.. ఇందులో తనను ఎవరూ భయపెట్టలేరు.. అణచివేయలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
మరి కొద్ది నెలల్లో రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పైలెట్ తన బలం చాటుకొనేందుకే ఈ ప్రదర్శనలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పైలెట్ గత నెలలో నిరాహార దీక్ష ప్రకటించగా అది పార్టీ వ్యతిరేక చర్యగా కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తాము నిందలపాలైనా.. పార్టీని బలోపేతం చేస్తూ.. ప్రజల్లోనే ఉన్నామని వ్యాఖ్యానించిన పైలెట్ ..గెహ్లోత్ వర్గం పదవులు అనుభవిస్తూనే తమను దుర్భాషలాడుతున్నారని విమర్శించారు. 2020లో తమ ప్రభుత్వం పడిపోకుండా వసుంధరా రాజే సింధియా సహకరించారని ఇటీవల సీఎం గెహ్లాట్ చేసిన వాఖ్యలను సచిన్ పైలెట్ తప్పుపడుతున్నారు. తమ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సోనియా గాంధీ అధినేత కాదు వసుంధరా రాజే సింధియా అంటూ సచిన్ పైలెట్ వ్యంగ్యస్త్రాలు సంధించించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో, సీఎం అశోక్ గెహ్లాట్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సచిన్ పైలెట్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.