Karnataka CLP Meet: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. నేడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అనూహ్య పరిణామాల తరువాత ఇప్పుడు ఢిల్లీ నుంచి బెంగళూరుకు రాజకీయం మారుతోంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు బెంగళూరులో కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పైన నిర్ణయం జరిగనుంది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 20న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావటం ఖాయమని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించేందుకు డీకే సిద్దంగా లేరని సమాచారం.
కర్టాటక రాజకీయం ఇప్పుడు ఢిల్లీ నుంచి బెంగళూరుకు మారుతోంది. ప్రధాన పోటీదారులైన మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉడుం పట్టు పడుతుండడంతో ఎవరిని ఆ పదవిలో నియమించాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్ఠానం తలపట్టుకుంటోంది. అగ్ర నేత రాహుల్‌గాంధీ స్వయంగా చర్చించినా.. సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్ చేసి మాట్లాడినా డీకే వెనక్కి తగ్గడం లేదు. తనకే సీఎం పదవి ఇవ్వాలని.. లేదంటే దళిత నేతకు కట్టబెట్టాలని.. సిద్దూకు మాత్రం ఇవ్వడానికి వీల్లేదని మంగళవారమే ఆయన కుండబద్దలు కొట్టారు. బుధవారం మరో అడుగు ముందుకేసి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సీఎం పదవి చేపట్టాలని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలూ ఆయన్ను వ్యతిరేకించరని తెలిపినట్లు తెలిసింది.
అటు సిద్దరామయ్య కూడా తనకివ్వకుంటే మూడో వ్యక్తికి ఇవ్వాలని.. శివకుమార్‌కు మాత్రం ఇవ్వొద్దని చెప్పారని ప్రచారం సాగుతోంది. తాను, డీకే చెరి రెండున్నరేళ్లు సీఎం పదవి పంచుకుంటామని కూడా మరోసారి ప్రతిపాదించారు. మొదట తానే ఉంటానన్నారు. ఈ ఫార్ములాకు శివకుమార్ సుముఖత తెలిపినా.. మొదట తనకే అవకాశమివ్వాలని షరతు పెట్టారు. దీంతో సీనియర్లకు ఏమీ పాలుపోలేదు. బుధవారం ఉదయం తొలుత సిద్దూ, తర్వాత డీకే 10–జన్‌పథ్‌లో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. అరగంట చొప్పున చర్చించారు. అక్కడ ఉండగానే సోనియాగాంధీ డీకేతో ఫోన్లో మాట్లాడారు. మరోసారి ఖర్గేను కలవాలని సూచించారు. డీకే శివకుమార్ ఈ చర్చల సమయంలో తన పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ చర్చల సమయంలోనే ఇతర రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షుల పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో తొలి రెండేళ్లు సిద్దూ సీఎంగా ఉంటారని.. మిగతా మూడేళ్లు శివకుమార్ ఉండేలా రెండో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇందుకు శివకుమార్ ససేమిరా అన్నారు. గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే ఒప్పందం కుదిర్చారని.. కానీ అశోక్ గహ్లోత్ అప్పటి పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు, భూపేశ్ బఘేల్ తన మంత్రి టీఎస్ సింగ్‌దేవ్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని, వారు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని ఆయన గుర్తు చేశారు. దీనివల్లే ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీలో సంక్షోభం కొనసాగుతోందని అన్నారు. దీంతో ఆయన్ను ఒప్పించడం అధిష్ఠానంకు సాధ్యం కావటం లేదు.
డీకేను ఏదో రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లు పార్టీ కోసం కష్టించి పనిచేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడపడం.. భారీ ఎత్తున నిధులు సమకూర్చడంతో అధిష్ఠానం ఆయన్ను విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే అధికారం దక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందనే ప్రచారం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో, సిద్దరామయ్యను తొలుత సీఎం..ఆ తరువాత డీకేను సీఎం చేసేలా ఒప్పందానికి చివరకు ఆమోదం లభించినట్లు సమాచారం. దీని పైన గురువారం సాయంత్రం బెంగళూరులో జరిగే సీఎల్పీ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. హైకమాండ్ భావిస్తున్న విధంగా అంతా సక్రమంగా జరిగితే ఈ నెల 20న కర్ణాటక కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.