కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికల్లా కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వస్తుందని అందరూ భావించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపిన ఖర్గే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు
Suspense continues over Karnataka New CM Candidate
కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రానికల్లా కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వస్తుందని అందరూ భావించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపిన ఖర్గే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం మరికొందరు కాంగ్రెస్ సీనియర్లతోను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోను చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
గాంధీల మద్దతు ఎవరికి ?
కర్ణాటక సీఎం ఎంపిక విషయంలో గాంధీ కుటుంబం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ, ప్రియాంక ప్రస్తుతం సిమ్లా లోనే ఉన్నారు. రాహుల్ గాంధీ, ఢిల్లీలో ఖర్గే నివాసానికి వచ్చి గంటర్నరకు పైగా సమాలోచనలు చేశారు. సముచిత రీతిలో నిర్ణయం తీసుకోవాలని ఖర్గే కు రాహుల్ గాంధీకి సూచించారు. ఖర్గే కూడా కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతే కావడంతో సొంతంగా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు.
సీఎం ఎంపిక విషయంలో తన నిర్ణయం, సోనియాగాంధీ నిర్ణయంతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. ఎమ్మెల్యేల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు. అదే విధంగా షిండే నేతృత్వంలోని ఏఐసిసి పరిశీలకుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని రాహుల్ గాంధీ ఖర్గేకు సూచించారు..
మా వాడికే ఛాన్స్ ఇవ్వండి – వీరశైవ మహాసభ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు లింగాయత్ వర్గానికి చెందిన కీలక ట్రస్ట్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపింది. ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. తమ వర్గీయులందరూ కాంగ్రెస్ నేతలకు ఓట్లు వేసి గెలిపించాలని ఆ లేఖలో కోరింది. అప్పట్లో ఆ విషయంలో కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఆ సంస్థ మరో లేఖ రాసింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖను పంపింది. కర్ణాటక ఎన్నికల్లో 46 మందిలో 34 మంది లింగాయత్ లీడర్లు గెలుపొందారని, ఆ వర్గానికి చెందిన వ్యక్తి పేరునే సీఎం పదవికి పరిగణలోకి తీసుకోవాలని లేఖలో వీరశైవ మహాసభ కోరింది.