Karnataka CM: కర్ణాటక సీఎం ఎంపిక మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇద్దరు నేతల మధ్య ముఖ్యమంత్రి పదవి వ్యవహారం పై ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ముమ్మరం అయింది. సిద్దరామయ్యాకు సీఎం పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. అయినా అధికారికంగా ప్రకటించ లేకపోతున్నారు. డీకే శివకుమార్ కు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో డీకే శివ కుమార్..సిద్దరామయ్య భేటీ ల తరువాత సీఎం ఎంపికపైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. రేపు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక వివాదం తెగటం లేదు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఇద్దరూ ఢిల్లీలో మకాం వేసారు. ఇప్పటికే సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు ఖర్గే స్వీకరించారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సోనియా, రాహుల్ అభిప్రాయంగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ను కాదని సిద్దరామయ్యకు సీఎం పదవి ఇవ్వటం కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. ఈ సమయంలో డీకే శివకుమార్ ముందు పలు ప్రతిపాదనలు చేస్తున్నారు. సీఎం పీఠం షేరింగ్ తో పాటుగా తన వారికి మంత్రి పదవుల విషయంలో హామీలు ఇస్తున్నారు. ఇస్తే సీఎం పదవి లేకుంటే సామాన్య ఎమ్మెల్యేగా కొనసాగుతంటూ డీకేశీ పట్టు బిగించారు. ఈ సమయంలో రాహుల్ నుంచి డీకే శివకుమార్ కు పిలుపు వచ్చింది.
కర్నాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ రణ్ దీపి సింగ్ సూర్జే వాలా కాసేపట్లో DK శివకుమార్ తో మరో సారి భేటి కానున్నారు. డీకే శివకుమార్ తో భేటి అయ్యాక ఖర్గే ను కలవనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ రాత్రికి ముఖ్యమంత్రి పేరు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సిద్దరామయ్య..డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు కోసం పంచాయితీ సాగుతున్న సమయంలో మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరన్ కు పిలుపు వచ్చింది. డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరు నేతలు వేర్వేరుగా రాహుల్ తో సమావేశం కానున్నారు. ఈ సమయంలో రాహుల్ వీరిద్దరికీ చేసే సూచన కీలకం కానుంది. ఆ తరువాత ఖర్గే, రాహుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంపిక ఖరారు కానుంది. ఈ రాత్రి లోగా కొత్త సీఎం ను ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రేపు బెంగళూరులో ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎంగా సిద్దరామయ్య.. డీకే శికుమార్ కు ఉప ముఖ్యమంత్రితో పాటుగా కీలక శాఖలు కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందుకు డీకే ససేమిరా అంటున్నారు. ఇదే సమయంలో తెర పైకి పరమేశ్వర్ ను ఏ బాధ్యతలు ఇస్తారనేది మరో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్. అటు స్వామీజీలు, మఠాధిపతులు డీకేకు మద్దతు గా నిలుస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సిద్దరామయ్యకు సీఎం పదవి ఇవ్వాలనేది తమ అభిప్రాయంగా చెబుతున్నారు. కొద్ది సేపటి క్రితం కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో రాహుల్ తో సమావేశమయ్యారు. కర్ణాటక పరిణామాల పైన చర్చించారు. వేణుగోపాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో రాహుల్ చర్చలు చేయనున్నారు.