కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఉత్కంఠభరితమైన డ్రామా తరువాత సిద్దరామయ్యకు పట్టం గట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మే 20వ తేదీన కన్నడ కంఠీవర స్టేడియంలో అంగరంగ వైభవంగా సిద్దరామయ్య పట్టాభిషేకం జరిగింది.
Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఉత్కంఠభరితమైన డ్రామా తరువాత సిద్దరామయ్యకు పట్టం గట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మే 20వ తేదీన కన్నడ కంఠీవర స్టేడియంలో అంగరంగ వైభవంగా సిద్దరామయ్య పట్టాభిషేకం జరిగింది. ప్రభుత్వం, మంత్రులు కొలువుదీరారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. అధికార మార్పిడి జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఐదు పథకాల అమలుపై సిద్దరామయ్య సంతకం చేశారు. అయితే, అది చట్టరూపం దాల్చాలంటే అసెంబ్లీలో ఆ పథకాలను బిల్లుల రూపంలోకి మార్పులు చేయాలి. చట్టం చేయాల్సి ఉంటుంది.
దీని కంటే ముందు అసెంబ్లీ ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాలి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కు వచ్చింది. స్పీకర్ పదవి స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శాసనసభకు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేశ్‌పాండే, ఏడుసార్లు ఎంపికైన టీబీ జయచంద్ర స్పీకర్ పదవిని స్వీకరించేందుకు ససేమిరా అన్నారు. స్పీకర్ పదవి మాకొద్దంటే మాకొద్దంటూ బల్లగుద్ది చేప్పేశారు. ఏ పదవి లేకుండా అయినా ఉంటాంగాని స్పీకర్ పదవిని మాత్రం చేపట్టబోమని స్పష్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ జల్లడ వేసి దక్షిణ కన్నడ జిల్లాలకు చెందిన యూటీ ఖాదిర్‌ను స్పీకర్ పదవికి ఒప్పించింది. వచ్చే టర్మ్‌లో మంత్రి పదవిని ఇస్తామని ఒప్పించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు చర్చలు జరిపి ఎట్టకేలకు ఒప్పించారు. దీంతో ఆయన ఎంపిక లాంచనమైంది.