దాంపత్య జీవితమైనా.. ఆటలైనా.. సినిమాలైనా.. రాజకీయాలైనా జోడీ అనేది చాలా ముఖ్యం. మంచి జోడీ కుదిరితే ఆ జంటకు తిరుగుండదు. ఇలాగే రాజకీయాల్లో విజయవంతంమైన జోడీగా నిలిచినవాళ్లు అనేకం ఉన్నారు. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు జోడీ సఖ్యతను గుర్తుచేస్తున్నాయి.
POLITICAL COMBINATIONS: సినిమా (Movies) అయినా. క్రీడలు (sports) అయినా. రాజకీయాలు (Politics) అయినా. జోడీ (COMBINATION) కుదిరితే హిట్టే. సినిమాల్లో హీరో, డైరెక్టర్ హిట్ కాంబినేషన్స్ అనేకం. అలాగే ఆటల్లో కెప్టెన్, వైఎస్ కెప్టెన్, డబుల్స్ సాధించిన విజయాలు పుష్కలం. క్రికెట్లో అయితే ఒకరు సిక్సర్లు, ఫోర్సు కొడుతుంటే మరొకరు వికెట్ కాపాడుతుంటారు. రాజకీయాల్లోనూ ఇలాంటి భాగస్వామ్యం (partnership) తప్పని సరి. సలహాలు సూచనలు లేకపోతే అడుగు ముందుకు పడదు. సరైన అభిప్రాయం చెప్పేవాళ్లు లేకపోతే తీసుకునే నిర్ణయాలు అడ్డం తిరుగుతాయి. కత్తి పట్టి కదన రంగంలోకి దిగకపోయినా మంచి జోడీ ఉంటే శ్రీకృష్ణుడిలా విజయం తథ్యం. అలా విజయం సాధించిన జోడీలు అనేకం ఉన్నాయి. ఒకరిది అనుభవం అయితే మరొకరిది దూకుడు. ఒకరు వ్యూహకర్త అయితే మరొకరు అమలు చేయడంలో దిట్టలు. ఒకరికి తొందరపాటు ఉంటే మరొకరు ఆచితూచి స్పందిస్తారు. ఒకరు కుందేలులా వ్యవహరిస్తే మరొకరు తాబేలులా విజయం సాధిస్తారు. ఇలా రాజకీయాల్లో జోడెడ్లలా ఓటర్లను మెప్పించి అధికార పీఠాన్ని అధిష్టించిన వారు అనేకం. కర్ణాటకలోనూ ఇదే తరహాలో జోడీ కుదిరింది. డీకే శివకుమార్ (dk shiva kumar), సిద్ధరామయ్య (siddaramaiah) కాంబినేషన్‌కు జనం జై కొట్టారు. మరి తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (congress), బీజేపీలో (bjp) ఈ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్ఆర్, రోశయ్య జోడీ..
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ (kvp) రామచంద్రరావు ప్రాణ స్నేహితుడు. ఆయనకు ఆత్మలాంటి వారు. రాజకీయాల్లో వైఎస్ (ysr) విజయం వెనక ఉన్నది ఆయనే. కానీ, ప్రత్యక్ష రాజకీయాల విషయానికి వస్తే కొణిజేటి రోశయ్య (Rosaiah), వైఎస్ఆర్ జోడీ బాగా కుదిరింది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షమైనా ఇద్దరూ హిట్ పెయిర్‌గా (hit pair) పేరు సంపాదించారు. రోశయ్య ముఖ్యమంత్రి కుర్చీకి దగ్గరగా వెళ్లి వైఎస్ వల్ల ఆగిపోయారు. చంద్రబాబు దెబ్బకు చతికిల పడిపోయిన కాంగ్రెస్‌కు వైఎస్సే కొత్త ఊపిరులు ఊదారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి ఒంటిచేత్తో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వైఎస్ సీఎం కుర్చీలో కూర్చోవడంతో సీనియర్ అయిన రోశయ్య మరోసారి ఆర్థిక మంత్రి పదవికే పరిమితం కావాల్సి వచ్చింది. సీనియర్ అయినప్పటికీ కష్టే ఫలి అన్నట్లుగా వైఎస్ సీఎం కావడం పట్ల ఎక్కడా అసంతృప్తి వెలిబుచ్చలేదు. రాజశేఖర్ రెడ్డికి అండగా నిలిచారు. వైఎస్ దూకుడుగా వెళ్తే ఆయన అనుభవంతో ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపారు. వైఎస్ హామీలు ఇచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రిగా బెంబేలెత్తేవాడినని రోశయ్య చెప్పేవారు. వై.ఎస్. హఠాన్మరణం తర్వాత రోశయ్య చలించిపోయారు. ఆ తర్వాత ఏడాది పాటు సీఎం పదవిలో ఉన్నా తప్పుకున్నారు. అలా ఈ జంట రాజకీయాల్లో మంచి జోడీగా నిలిచిపోయింది.
కేసీఆర్, కేకే జోడీ..
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ (kcr) వెంట అనేక మంది నేతలు నడిచారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత ఆలె నరేంద్ర, నాయిని నర్సింహారెడ్డి, కోదండరామ్, హరీష్ రావు ఇలా అనేక మంది కేసీఆర్‌కు ఉద్యమ సమయంలో జోడీగా నిలిచారు. ఆ తర్వాత కె.కేశవరావు (k.keshava Rao) సలహాలతో చాణక్యం ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విలీనం చేసి పార్టీ ఉనికి కోల్పోతుందనే అనుమానాలను పటాపంచలు చేసి జాతీయ స్థాయికి ఎదిగేలా తెరవెనుక రాజకీయ చతురత ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు మంచి ఇమేజ్ తీసుకురావడంలో కేకే ముఖ్యపాత్ర పోషించారు. తనకున్న పరిచయాలు, వ్యూహాలతో గులాబీ అధినేతను విజయ తీరాలకు చేరుస్తున్నారు. కేకే (kk) గులాబీ తీర్థం పుచ్చుకున్న తర్వాత కేసీఆర్ కూడా అతనికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు అప్పగించారు. రాజకీయంగా ముఖ్య నిర్ణయాలన్నీ కేకే సలహా మేరకే కేసీఆర్ నడచుకుంటారట. వీళ్లు కూడా ఒకరేమో దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి కాగా.. మరొకరు అనుభవం అంతా రంగరించి ఆచితూచి స్పందించే తత్వం. ఇలా ఈ జంట కూడా చాలా కాలంగా రాజకీయాల్లో హిట్ జోడీగా పేరు సంపాదించింది.
డీకే, సిద్దరామయ్య జోడీ..
కర్ణాటక ఎన్నికల్లో దశాబ్ధం తర్వాత చిరస్మరణీయమైన విజయం అందించింది డీకే శివకుమార్ (dk), సిద్దరామయ్య (siddaramaiah) జోడీ. వీళ్లు కూడా కర్ణాటకలో పార్టీకి జోడెడ్లుగా నిలిచారు. ఒకరేమో మచ్చలేని పాలన అందించిన మాజీ ముఖ్యమంత్రిగా మరొకరేమో ఇచ్చిన మాట కోసం ఎంతదాకా అయినా వెళ్లే స్వభావం ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఒకరిది అనుభవం, మరొకరిది దూకుడు. ఒకరు సుతిమెత్తగా విమర్శలు చేస్తే మరొకరు వాగ్భాణాలు సంధిస్తారు. ఒకరు నిదానంగా నేలపై నడిస్తే ఒకరు గాల్లో చక్కర్లు కొడుతూ కర్ణాటకను సుడిగాలిలా చుట్టేశారు. ఇలా ఈ ఇద్దరూ కర్ణాటక ఎన్నికల్లో చక్రం తిప్పారు. ఒకరు అనుభవాన్ని రంగరించి వ్యూహాలు రచించారు. మరొకరు ఆ అనుభవాన్ని ఓట్లుగా మలిచారు. కన్నడనాట బీజేపీ, మోడీని ఢీ కొట్టి విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చావో రేవో అనే ఎన్నికల్లో గెలుపు రుచి చూపించి జీవం పోశారు. ఈ ఇద్దరు కూడా హిట్ జోడీగా నిలిచారు.
మోడీ, అమిత్ షా జోడీ..
బీజేపీ రెండో దశలో దాని దశను మార్చిన నేతలు నరేంద్ర మోడీ (Modi), అమిత్ షా (Amith shah). ఈ ఇద్దరూ గుజరాత్ (Gujarath) నుంచి ఢిల్లీకి చేరి కమలం పార్టీని కంచుకోటగా మలిచారు. ఒక్క రాష్ట్రంతో వేట మొదలు పెట్టి దేశంలో తిరుగులేని శక్తిగా అవతరించేలా కృషి చేశారు. ఈ ఇద్దరి రాజకీయ వ్యూహాలకు కాకలు తీరిన కాంగ్రెస్ పార్టీ కూడా కకా వికలమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదానికి చేరువైంది. అమిత్ షా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నడ్డాకు అప్పగించినప్పటికీ ముఖ్య నిర్ణయాలన్నీ అతని కనుసన్నల్లోనే జరుగుతాయి. మోడీ ముందున్న రాజకీయ వ్యూహకర్త అమిత్ షానే. ఇలా ఈ జోడీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే కర్ణాటక ఫలితాలు మాత్రం కొంత నిరాశ పరిచాయి. వచ్చే ఎన్నికలకు ఈ జోడీ ఎలాంటి విజయం సాధిస్తుందనే తేలాల్సి ఉంది. హ్యాట్రిక్ కొడతారా? లేదంటే విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? అనే చర్చ జరుగుతోంది.
ఖర్గే, రాహుల్ జోడీ..
ఇందిరా గాంధీ హయాంలోనూ ఆమెకు నమ్మిన బంట్లు ఉండేవారు. రాజకీయ, పాలనా నిర్ణయాల్లోనూ సలహాలకు కొదవలేదు. ఇందిర దూకుడుగా వ్యవహరిస్తే నమ్మినబంట్లు కొంత శాంతంగా సూచనలు ఇచ్చేవారు. అలాగే సోనియా (sonia) గాంధీ నేతృత్వంలోనూ మన్మోహన్ (Manmohan) కాంబినేషన్ 10 ఏళ్లు కొనసాగింది. సోనియా దూకుడు ప్రదర్శించినా.. మన్మోహన్ నెమ్మదస్తుడిగా తనపని తాను చేసుకుపోయేవారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనూ మన్మోహన్ ఆర్థిక మంత్రిగా మంచి జోడీ కుదిరింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మల్లిఖార్జున్ ఖర్గే (Kharge) తోడయ్యారు. రాహుల్ దూకుడు ప్రదర్శిస్తుండగా ఖర్గే తన అనుభవాన్ని రంగరిస్తున్నారు. భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జవ సత్వాలు తీసుకొచ్చేందుకు రాహుల ప్రయత్నించారు. ఇటు ఖర్గే కూడా తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు వ్యహాలు రచిస్తున్నారు. మరి ఈ జోడీ కూడా వచ్చే సాధారణ ఎన్నికలకు ఎలాంటి విజయం సాధిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
జగన్, విజయసాయి జోడీ..
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ జోడీ మంచి విజయమే సాధించింది. ఆడిటర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయసాయిరెడ్డి (vijaya sai Reddy), జగన్ (Jagan) జోడీ రాజకీయాల్లోనూ మంచి ఫలితాలు రాబట్టింది. వైఎస్సార్, కేవీపీ తరహాలో ద్వయం బాగానే కుదిరింది. విజసాయి కూడా రాజ్యసభ సభ్యుడితో పాటు వైసీపీ పార్లమెంటరీ నేతగా ఎదిగారు. అయితే కొద్ది రోజులుగా ఈయను జగన్ పక్కనపెట్టారు. ఇప్పుడిప్పుడే మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి జగన్ వెంట జోడీగా ఎవరు నడుస్తారనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న సజ్జలా(sajjala)? లేదంటే వైవీ సుబ్బారెడ్డా(yv subba reddy)? ఎవరు ఎన్నికల వ్యూహకర్తగా మారతారు? లేదంటే మళ్లీ జగన్, విజయసాయి జోడీ ఎన్నికలను ఎదుర్కొంటుందా? అనేది తేలాల్సి ఉంది.
చంద్రబాబు, పవన్ జోడీ..
టీడీపీ అధినేత చంద్రబాబు (chandra babu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్ 2 స్థానంలో ఉన్నవారు అండగా నిలిచేవారు. ఇలాగే ఎన్టీఆర్‌కు కూడా చంద్రబాబు జోడీగా ఉన్నారు. ఆ తర్వాత బాబుకు ఎలిమినేటి మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి జోడీగా ఎదిగారు. విభజన తర్వాత అచ్చెన్నాయుడు ఆ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరో పార్టీ నాయకుడైనా జోడీగా పనిచేస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా జనసేనను ముందుకు నడిపిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి రావాలంటే ఈ జోడీని జనం ఎలా అదరిస్తారనేది తేలాల్సి ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ నెంబర్-2 గా వ్యవహరించారు. ఇప్పుడు జనసేనలో నాగబాబు ఆ పాత్ర పోషిస్తున్నారు. అయితే సేనాని ప్రధాన పాత్రలో కాకుండా పొత్తులో భాగంగా ఏపీ రాజకీయాలను ఎదుర్కోవాలని నిర్ణయించడమే అందుకు కారణం.
రేవంత్‌కు జోడీ ఎవరు..?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ నెంబర్-2 కాదు కదా.. రేవంత్‌కు పూర్తి స్థాయిలో అండగా నిలిచే సీనియర్లు కనిపించడం లేదు. ఎవరి అజెండా వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డికి అతిపెద్ద సమస్యగా మారింది. తన దూకుడుకు తగ్గట్లుగా తెరవెనక వ్యూహాలు రచించేలా సిద్దరామయ్య వంటి సిద్ధహస్తుడు ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేవంత్‌కు జోడీగా భట్టి విక్రమార్క ఉంటే కర్ణాటక తరహా ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. రేవంత్ రెడ్డి దూకుడుకు భట్టి (Batti) అనుభవం తోడైతే హస్తం విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్లు కాకుండా హిట్ జోడీగా నిలవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీనియర్లంతా ఐక్యంగా ఉండి అదే తరహాలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డికి సిద్ధరామయ్యలా తోడు నిలిచి పార్టీని విజయతీరాలకు చేర్చేది ఎవరనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.
బండికి కుదరని జోడీ..?
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. రేవంత్ రెడ్డి తరహాలోనే ఒంటరి పోరాటమే కనిపిస్తోంది. అయితే క్రమశిక్షణ గల పార్టీగా ముద్ర ఉన్న కమలంలో కాంగ్రెస్‌లా అసంతృప్తి నేరుగా బయటపడటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కు (Etela Rajender) బండికి పడటం లేదంటున్నారు. అలాగే కొత్తగా చేరిన వాళ్లు సంజయ్‌తో పెద్దగా ఇమిడి పోవడం లేదట. ఏమైనా అంటే ఢిల్లీలో ఫిర్యాదు చేస్తున్నారట. కిషన్ రెడ్డి (Kishan reddy), లక్ష్మణ్ (Laxman) ఇలా ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా ఉంటే బాగుండేదని కమలం శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. జాతీయ స్థాయిలో మోడీ, అమిత్ షా తరహాలో రెండో ప్రధాన్యం లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్ దూకుడుగా వెళ్తుండగా అనుభం, వ్యూహాలను రూపొందించడంలో వెనకబాటు కనిపిస్తోంది. ఇటీవల సంజయ్ అరెస్ట్ సహా వివిధ అంశాల్లో ఇది స్పష్టమైంది. సంజయ్ దూకుడుగా పాదయాత్రలు చేస్తూ జనంలోకి చొచ్చుకెళ్తూ ప్రజాభిమానం చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో అతని నాయకత్వాన్ని బలపరిచేలా మరో బలమైన నాయకత్వ లోటు రాష్ట్ర బీజేపీలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికలకు సంజయ్‌కు జోడీగా ఎవరు నడిచి పార్టీని విజయ పథాన నడిపిస్తారనే చర్చ జరుగుతోంది.