2000 Note Politics: దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మరోసారి తెర మీదకు వచ్చింది. ఆర్బీఐ ఆకస్మికంగా రెండు వేల నోటును ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2000నోట్లను 30 సెప్టెంబర్ 2023 వరకు మార్చుకోవాలని సూచించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే వెలువడిన ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు కేంద్రంలోని అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఇప్పుడు ఈ నిర్ణయం బీజేపీ పై పోరాటానికి ఆయుధంగా మారుతోంది.
ఆర్బీఐ 2000 నోటు పైన ప్రకటన రాగానే రాజకీయ కలకలం మొదలైంది. ఆర్బీఐ రెండు వేల నోట్ల మార్పిడి పైన పలు సూచనలు చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి బ్యాంకుల్లో వీటి మార్పుకు సంబంధించి అవకాశం కల్పిస్తూ ప్రకటన చేసింది. ఆర్బీఐ నిర్ణయం పైన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని తప్పు బట్టాయి. నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోగా, బీజేపీ సమర్థించుకుంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు మూర్ఖపు నిర్ణయాన్ని దాచిపెట్టేందుకే రూ.2000 నోటును తీసుకొచ్చారని సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. నోట్ల రద్దు తర్వాత కొద్ది వారాలకే ఆర్బీఐ ఒత్తిడికి గురై రూ.500 నోటు తీసుకొచ్చిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ మళ్లీ 1000 రూపాయల నోటు తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.
ఈ నిర్ణయం పైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందుకే ప్రధానికి చదువుకోవాలని చెబుతున్నామని ఢిల్లీ సీఎం అన్నారు. నిరక్షరాస్యుడైన ప్రధానమంత్రికి ఎవరైనా ఏదైనా చెప్పగలరని ఎద్దేవా చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘‘2000 నోటు తెస్తే అవినీతి ఆగిపోతుందని.. ఇప్పుడు 2000 నోట్ల రద్దుతో అవినీతి అంతం అవుతుందని చెబుతున్నారు. అందుకే పీఎం చదువుకోవాలని అంటున్నాం.. నిరక్షరాస్యుడైన పీఎం ఎవరైనా ఏమైనా చెబుతారు.. ఆయనకు అర్థం కావడం లేదు. .ప్రజలు ఇబ్బంది పడాలి..అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. ప్రజానీకం ఇబ్బంది పడాల్సి వస్తుందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. వైసీపీ ఆర్బీఐ నిర్ణయానికి మద్దతు ప్రకటించింది.
ఇదే అంశం పైన స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. రూ.2,000 నోటు పేలుడు కాదని, ఒక బిలియన్ భారతీయులకు బిలియన్ డాలర్ల మోసం అని ప్రభుత్వంపై దాడి చేశారు. నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా మేల్కొనండి. నోట్ల రద్దు వల్ల పడిన బాధను మర్చిపోలేం. ఈ బాధ కలిగించిన వారిని క్షమించకూడదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్బీఐ ప్రకటన సైన స్పందించిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ కొందరు తమ తప్పును ఆలస్యంగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు , ఆర్థిక వ్యవస్థ దీనికి మూల్యం చెల్లించవలసి ఉంటుందన్నారు. పాలన ఏకపక్షంగా సాగదు, తెలివిగా, నిజాయితీగా నడుస్తుందని పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని బీజేపీ సమర్ధించుకుంది. దీనిని నల్లధనంపై ఇది రెండో సర్జికల్ స్ట్రైక్ అని ఆర్బీఐ నిర్ణయంపై బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. దీని వల్ల ప్రజల వద్ద ఎంత నల్లధనం ఉందో అది బయటకు వస్తుంది. అమెరికా 100 డాలర్ నోటుతో పరుగెత్తుతుంది, భారతదేశంలో 2000 రూపాయల అవసరం ఏమిటని ప్రశ్నించారు నోట్ల రద్దు సమయంలో ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం రూ.2000 నోట్లను ముద్రించడం ప్రారంభించిందన్నారు. రూ.2000 నోట్లు లేని కారణంగా సామాన్యులకు ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కర్ణాటక ఎన్నికల్లో పరాజయం పాలైన బీజేపీ దానిని పక్కదోవ పట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.