కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. దేశవ్యాప్తంగా కర్ణాటక పవనాలు వీచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. కర్ణాటక ఫలితాలు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ఆ పార్టీని విజయం సాధించేలా చేసింది.
Congress Vs BJP: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. దేశవ్యాప్తంగా కర్ణాటక పవనాలు వీచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. కర్ణాటక ఫలితాలు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ఆ పార్టీని విజయం సాధించేలా చేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఇవ్వడంతో ఆ పార్టీకి లాభించింది. దీంతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా కొంతమేర లాభించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలపై కర్ణాటక ఎన్నికలు, భారత్ జోడో ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై ఎన్డీటీవీ-సీఎన్‌డీఎస్ సర్వేను నిర్వహించింది. వివిధ రాష్ట్రాల్లో శాంపిల్స్‌ను సేకరించారు.
కాంగ్రెస్ పుంజుకుంది
గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు సర్వేలో తేలింది. బీజేపీకి ఈసారి దేశవ్యాప్తంగా 43 శాతం ఓట్లు లభించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే 10 శాతం పుంజుకొని 29 శాతం ఓట్లను సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా ఆ పార్టీ ఓటుబ్యాంకు పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే, బీజేపీ ఓటు బ్యాంకు ఒకశాతం తగ్గడం ఆ పార్టీని ఇబ్బందిపెట్టే అంశమే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో బీజేపీ తీసుకునే నిర్ణయాలను అనుసరించి ఓటుబ్యాంకు శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
మోడీకే పట్టం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోడీకే పట్టం గట్టనున్నారు. ప్రధానిగా ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే దానిపై ప్రశ్నించగా మోడీకే పట్టం కడతామని ప్రజలు చెప్పడం విశేషం. 43శాతం మంది ప్రజలు మోడీవైపుకు మొగ్గుచూపారు. ఇక గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 23 శాతం మంది జై కొట్టగా, ఈసారి ఆ సంఖ్య 27 శాతానికి పెరిగింది. మోడీ కి ఎందుకు ఇష్టపడతారని ప్రశ్నించగా… మోడీ ప్రసంగాలు బాగుంటాయని, మోడీ అభివృద్ధికి బాటలు వేశారని, కష్టపడి పనిచేసే తత్వం ఉందని, నిస్వార్థంగా పనిచేస్తారని ప్రజలు చెప్పుకొచ్చారు.
కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ అనుసరించే వ్యూహాల్లో మార్పులు చేయనున్నది. మతతత్వ విధానాన్ని అవలంబిస్తూనే అభివృద్ధి నినాదంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఆశయంతో పనిచేయాలని నిర్ణయించింది. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాడికల్ సంఘాలు పేట్రేగిపోతుంటాయనే నానుడి ఉంది. కర్ణాటకలో ఇప్పటికే కొన్ని చోట్ల ఆ ప్రభావం కనిపిస్తున్నది. మరి ఈ విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెంగళూరులో వరదలు సంభవించాయి. రోడ్లు వరదలను తలపిస్తున్నాయి. మరి దీనిని ఆ ప్రభుత్వం ఏ విధంగా సాల్వ్ చేస్తుందో చూడాలి.
పర్యటనలు లాభిస్తాయా
ప్రధాని మోడీ మళ్లీ విదేశీ యాత్రలు చేస్తున్నారు. జపాన్, న్యూజిల్యాండ్ ఫిజీ, పాపుయా న్యూగినియా, ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన సభలో ప్రధాని మోడీ ప్రసంగం ఆకట్టుకుంది. మోడీ ది బాస్ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని స్వయంగా పేర్కొన్నారు అంటే ఆయన ఫాలోయింగ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, పాపుయా న్యూగినియా ప్రధాని ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం పలికి, ప్రధాని మోడీ కాళ్లకు దణ్ణం పెట్టారు. ఒక ప్రధాని మరో ప్రధాని కాళ్లను మొక్కడం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా కుదేలవుతుంటే, భారత్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతున్నది. ఇవన్నీ బీజేపీకి కలిసివచ్చే అంశాలుగా చెప్పవచ్చు.