BJP Target 2024: కర్ణాటక ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి కొత్త శక్తిని ఇచ్చింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. అటు బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల పైన నజర్ పెట్టింది. మరో అయిదు రాష్ట్రాల్లో పార్లమెంట్ కంటే ముందే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అందులో మరోసారి రెండు పార్టీలు హోరా హోరీగా తలపడే అవకాశం ఉంది. కర్ణాటక ఫలితాలు బీజేపీకి గుణపాఠంగా మారనున్నాయి. కర్ణాటక ఫలితాలతో రెండు పార్టీల్లో వచ్చే మార్పు ఏంటి.
దక్షిణాదిన అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది. తమిళనాడులో ప్రయోగాలు చేస్తున్నా కలిసి రావటం లేదు. తెలంగాణలో అనుకున్న జోష్ కనిపించట్లేదు. ఏపీలో అసలు పార్టీ భవిష్యత్ పై డైలమా కొనసాగుతోంది. ఈ సమయంలో కర్ణాటక ఫలితాలతో బీజేపీ నేతలు అప్రమత్తం అయ్యారు. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి. అందులో చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ లక్ష్యం కూడా పార్లమెంట్ ఎన్నికలే. అందులో భాగంగానే ఇప్పుడు డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని నిర్ణయించింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల పైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసారు. 2012లో ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినా, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 73 సీట్లు గెలిచిన విషయం గుర్తు చేస్తున్నారు. 2018 లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం సాధించినా 2019 ఎన్నికల్లో ప్రభావితం చేయలేకపోయానని విశ్లేషించారు. ప్రస్తుతం కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, కర్ణాటకలో అధికారంలో ఉంది. బీహార్, జార్ఖండ్, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షాల పాలన సాగుతోంది. అస్సాం, గోవా, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు ఐకమత్యంగా పని చేయటంతోనే గెలుపు సాధ్యమైందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో పని చేసి బీజేపీకి షాక్ ఇవ్వాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటక పరాభవంతో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలంటే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు సెమీస్ గా భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల నుంచి నేర్చుకున్న గుణపాఠంతో అవసరమైన చోట నాయకత్వ మార్పుకు సిద్దం అవుతోది. గుజరాత్ లో చేసిన విధంగా కర్ణాటకలోనూ సీఎం ను మార్చి ఉంటే ఫలితాలు ఇలా ఉండేవి కావనే అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి కమలం కకావికలం అవుతుందా లేక గుణపాఠాలతో సరి దిద్దుకుంటారా చూడాలి.