కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి... కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిచుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి... ఫలితాలు వెలువడిన రోజు నుంచే ఈ ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఎన్నికలను ముందుండి నడిపించి విజయం సాధించడంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్ కీలక పాత్ర పోషించారు.
Karnataka Political Tension: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి… కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిచుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి… ఫలితాలు వెలువడిన రోజు నుంచే ఈ ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఎన్నికలను ముందుండి నడిపించి విజయం సాధించడంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని చెబుతున్నారు. పార్టీని గెలిపించుకున్న తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక, సిద్దిరామయ్యకు ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు, పార్టీలో, రాష్ట్రంలో మంచి పేరు ఉన్నది. ఆయనకు పగ్గాలు అప్పగిస్తే అనుకున్న విధంగా అంతా సవ్యంగా సాగుతుందని అధిష్టానం ఆలోచన.
కానీ, డీకే అందుకు ససేమిరా అంటున్నారు. తాను చేసిన కృషి ఫలితమే రాష్ట్రంలో సాధించిన విజయమని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని అంటున్నారు డీకే. సిద్దరామయ్య, డీకే ఇద్దరూ కాంగ్రెస్ కు, సోనియా కుటుంబానికి బాగా కావలసినవారే. ఇద్దరిలో ఎవరికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలా అనే మీమాంశలో పడిపోయింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈరోజు సాయంత్రం వరకు దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
పీఠంపై పట్టు- ఉచితాల ఎఫెక్టు
ముఖ్యమంత్రి పీఠం ఎవరు అలంకరించినా ఇప్పుడు ఇది ముళ్లకుర్చీలా మారే అవకాశం ఉంది. ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్‌ను గెలిపించారు. దీనికి ప్రధాన కారణం మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచితాలేనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీపై వ్యతిరేకత ఏవిధంగా ఉన్నా, ఉచితాల ప్రభావం భారీగా కనిపించింది. ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ చెప్పిన పంచరత్నాలు, అదనంగా డీజిల్ పథకాన్ని అమలు చేయవలసి ఉంటుంది. దీనికోసం ప్రతి ఏడాది రాష్ట్రప్రభుత్వంపై సుమారు రూ. 62 వేల కోట్ల భారం పడనుంది. ఈ పథకాలు అమలు జరగాలి అంటే రాష్ట్రానికి అదనంగా ఆదాయం లభించాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనంగా ఇంత ఆదాయం రావాలంటే ప్రభుత్వానికి విరివిగా ఆదాయం లభించే మార్గాలపై దృష్టి సారించాలి. పన్నులు బాదితే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. నిరసనలు చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ అధికారంలో ఉండగా ధరలు పెంచారని ఆందోళనలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పన్నులు పెంచితే దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఎవరు బెస్ట్
కర్ణాటక సీఎంగా ఎవరు సమర్థులు అనే దానిపై ఖచ్చితంగా చెప్పడం కష్టమే. కర్ణాటక ట్రబుల్ షూటర్‌గా డీకేకు మంచి పేరుంది. కష్ట సమయాల్లో ఆయన పార్టీని గట్టించగల సమర్థుడు. మంత్రిగా గతంలో బాధ్యతలు కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం అంటే సామన్యమైన విషయం కాదు. కర్ణాటకలోని ఆరు ప్రాంతాల ప్రజల మనోభావాలను అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజలు ఈ ప్రాంతాల ప్రజలు ఆందోళన బాట పట్టక తప్పదు.
సిద్దరామయ్య గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉన్నది. అయితే, గతంలో ఈ స్థాయిలో ఉచిత హామీలు ఇవ్వలేదు. కానీ, ఈసారి తడిసిమోపెడయ్యే విధంగా హామీలు ఇచ్చారు. పైగా అధికారంలోకి వచ్చిన తరువాత బాధ్యతలు తీసుకున్న వెంటనే తొలి సంతకం ఉచిత హామీల అమలుపైనే అని ప్రచారం చేసుకున్నారు. గెలిచిన తరువాత కూడా ఇదే విషయాన్ని ప్రెస్మీట్లో పేర్కొన్నారు. గెలిచేందుకు ఉచితాలను ప్రచారం చేసుకొని ఆ తరువాత అమలు చేయకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.
నేడు తేలిపోతుందా
సోమవారం నుంచి కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై టెన్షన్ నెలకొన్నది. కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యను, డీకేను ఢిల్లీ రావాలని కోరింది. అయితే, సిద్దరామయ్య ఒక్కరే ఢిల్లీ వెళ్లారు. కడుపునొప్పిగా ఉందని డీకే వాయిదా వేసుకున్నారు. పైగా, ఢిల్లి నుంచి పిలుపు వచ్చే ముందు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పార్టీ కోసం చేసిన సేవలు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేసిన కృషిని మీడియా ముందుంచారు. తనకే అధిష్టానం అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే, సిద్దరామయ్య పీఠాన్ని చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదనలను తీసుకొచ్చినా డీకే ససేమిరా అంటున్నారు.
చెరిసగం అనే మాట వింటే కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రెండున్నరయేళ్లు జేడీఎస్ నేత ముఖ్యమంత్రిగా ఉండాలి. అయితే, ఒకటిన్నర సంవత్సరం కాగానే పార్టీలో చెలరేగిన అంతర్గత కుమ్ములాటల కారణంగా సంకీర్ణ కూటమి కుప్పకూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఇప్పుడు చెరిసగం అనే మాటకు డీకే నో చెబుతున్నాడు.
అధిష్టానం మాత్రం సిద్దరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈరోజు సాయంత్రం వరకు సీఎం విషయంలో క్లారిటీ తీసుకురానున్నారు. రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త సీఎం బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్నది. సిద్దరామయ్యకు బాధ్యతలు అప్పగిస్తే తాను కేబినెట్లో కూడా చేరనని డీకే స్పష్టం చేశారు.
కేసుల ప్రభావం…
సిద్దరామయ్యను కాదని డీకేకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, డీకేపై ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 30న మరోసారి ఆయనపై విచారణ జరగనున్నది. ఈ కేసులో ఏదైనా జరగొచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిరూపణ జరిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి… అప్పటికప్పుడు ముఖ్యమంత్రిని మార్చినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతిని తారాస్థాయిలో జరుగుతుందనే నానుడి ఉంది. దీనిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. అన్నీ ఉన్నా తినేందుకు నోచుకోలేదు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. మెజారిటీకి అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నా. పీఠంపై ఎవర్ని కూర్చోబెట్టాలి అన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది. కాంగ్రెస్ రాజకీయాలంటే ఇలానే ఉంటాయి మరి.