కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు మంచి జోష్‌ను ఇచ్చాయి. కలిసి కట్టుగా ప్రణాళికా బద్దంగా ప్లాన్ చేస్తే తప్పకుండా మళ్లీ పార్టీని పునరుజ్జీవనం చేయవచ్చనే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.
Congress: కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు మంచి జోష్‌ను ఇచ్చాయి. కలిసి కట్టుగా ప్రణాళికా బద్దంగా ప్లాన్ చేస్తే తప్పకుండా మళ్లీ పార్టీని పునరుజ్జీవనం చేయవచ్చనే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోవాలని కూడా పార్టీ నిర్ణయించింది. అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తరువాత తన సొంతరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా విజయాల కోసం ప్రణాళికలు వేస్తున్నారు. మధ్యప్రదేశ్ పై ఆ పార్టీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినా, సింధియా – కమల్ నాథ్ మధ్య వర్గపోరు కారణంగా అధికారాన్ని మధ్యలోనే కోల్పోవలసి వచ్చింది.
చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈసారి మధ్యప్రదేశ్‌లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈసారి స్పష్టమైన మెజారిటీని సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈసారి కూడా కమల్‌నాథ్ నేతృత్వంలోనే ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు సిద్దమౌతున్నారు కాంగీ నేతలు. దీంతో పాటు ఈ ఏడాది రాజస్థాన్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. అశోక్ గెహ్లాట్-సచిన్ పైటల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధిష్టానం పట్టుదలతో పార్టీ పగ్గాలు కోల్పోకుండా పట్టుకొని నడిపిస్తున్నది. రాజస్థాన్ ఎన్నికల్లో ఎవరి సారథ్యంలో పార్టీ ముందుకు వెళ్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నది. దీంతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు ఉండటంతో… ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుగడలను ప్రారంభించారు. మరి ఎవరికి ప్రజలు మద్దతు పలుకుతారన్నది త్వరలోనే తేలిపోతుంది. కర్ణాటకలో వీచిన గాలులను దేశంలోని అన్ని రాష్ట్రాలకు మళ్లించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.