Opposition parties Decision: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. మొత్తం 19 పార్టీలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసాయి. ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని స్పష్టం చేసాయి. కాంగ్రెస్ తో సహా మరో 17 పార్టీల నేతలు ఈ ప్రకటన పైన సంతకాలు చేసాయి. బీజేపీ పైన రాజకీయంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ అదే బాట ఎంచుకుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని చేత కాకుండా దేశాధినేత అయిన రాష్ట్రపతి చేత ప్రారంభింపచేయాలని ఈ పార్టీలన్నీ డిమాండు చేస్తున్నాయి. దీంతో..ప్రారంభోత్సవం వేళ హాజరయ్యేదెవరనేది వేచి చూడాలి.
పార్లమెంట్ నూతన భవనం ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించటం పైన ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చాయి. కీలక ప్రకటన విడుదల చేసాయి. కాంగ్రెస్ తో సహా అన్ని పక్షాలు ఈ విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నాయి. 19 పార్టీలు ఈ మేరకు తాము పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రధాని వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తామంతా ఈ ప్రారంభోత్సవానికి దూరంగం ఉంటున్నట్లు ప్రకటించాయి. ప్రధాని మోదీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో విఫలం అవుతన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని తీసుకొనే ఏకపక్ష నిర్ణయాలకు తాము మద్దతుగా నిలవలేమని తేల్చి చెప్పాయి.
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటం సరి కాదని ప్రతిపక్షాలు మండిపడితున్నాయి. నాటి పార్లమెంట్ శంకుస్థాపన..నేడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం గిరిజనులను అవమానించడమేనంటూ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ విమర్శలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఖండించారు. పార్లమెంట్ అనెక్స్ భవనాన్ని ఇందిరా గాంధీ ప్రారంభించగా, పార్లమెంటు గ్రంథాలయానికి రాజీవ్ గాంధీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నూతన భవనాన్ని ప్రధాని చేత కాకుండా దేశాధినేత అయిన రాష్ట్రపతి చేత ప్రారంభింపచేయాలని ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండు చేస్తున్నాయి.
రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతిని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా ప్రభుత్వం పదే పదే బాధ్యతలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కొత్త పార్లమెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించలేదని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించడం లేదని ఖర్గే ట్వీట్ చేశారు. దేశంలో రాష్ట్రపతి మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతి పౌరునికి ప్రాతినిధ్యం వహిస్తారని, ఆమె భారతదేశపు మొదటి పౌరురాలని ఖర్గే గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని ఖర్గే తన ట్వీట్లో పేర్కొన్నారు.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఇతర ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి.ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని కార్యనిర్వాహక అధిపతి మాత్రమే, శాసనసభ కాదన్నారు ఒవైసీ. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన లో బీఆర్ఎస్ లేకపోయినా…ఆ పార్టీ కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ సమయంలో పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఇప్పటి వరకు తటస్థంగా వ్యవహరిస్తున్న పార్టీల వైఖరి ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆలోచనలో ఏమైనా మార్పు ఉంటుందా అనేది వేచి చూడాలి
19 పార్టీలు ఇవే…
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి
19 opposition parties issue a joint statement to boycott the inauguration of the new Parliament building on 28th May, saying "When the soul of democracy has been sucked out from the Parliament, we find no value in a new building." pic.twitter.com/7p7lk9CNqq
— ANI (@ANI) May 24, 2023