వేసవిలో చల్లని కుల్ఫీ తింటే రుచి అదిరిపోతుంది. అయితే బంగారు కుల్ఫీ ఎప్పుడైనా తిన్నారా?
Gold Kulfi: పాలతో చేసే కుల్ఫీలు (Kulfi)) అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేసవిలో (Summer) వీటి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కుల్ఫీ తినగానే చల్లని (cooling) భావన శరీరం అంతా పాకుతుంది. అందుకే వేసవిలోనే కుల్ఫీల అమ్మకాలు ఎక్కువ. దీన్ని పాలతో తయారుచేస్తారు, కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే. కుల్ఫీలో ఎన్నో రకాలు ఉన్నాయి. పిస్తా కుల్ఫీ, బాదం కుల్ఫీ, మామిడి కుల్ఫీ ఇలా నచ్చిన రకాన్ని ఎంచుకొని తినవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి గోల్డ్ కుల్ఫీని (Gold Kulfi) కూడా తయారు చేస్తున్నాడు. బంగారంతో చేసిన ఆకులో కుల్ఫీని చుట్టి అందిస్తున్నాడు. ఆ కుల్ఫీని తినాలంటే ఇండోర్ వెళ్లాల్సిందే.
ఇండోర్‌లోని ఒక వీధి వ్యాపారి ఇలా కుల్ఫీని తయారుచేసి అమ్ముతున్నాడు. దీన్ని ఓ ఫుడ్ బ్లాగర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశాడు. ఆ వీడియోలో వ్యాపారి కుల్ఫీనీ బంగారు రేకులో చుట్టి విక్రయిస్తున్నాడు. దాని ఖరీదు 350 రూపాయలు. ఆ బంగారు రేకులు 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. అందుకే ఇంత తక్కువ రేటుకి అందించగలుగుతున్నాడు.
బంగారానికీ, ఆహారానికీ ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బంగారాన్ని ఆహార పదార్థాలలో వాడడం అనేది పురాతన కాలం నుంచి వస్తుంది. విశాఖపట్నంలోని ఓ బిర్యాని సెంటర్ వారు 24 క్యారెట్ల బంగారు ఆకులతో ప్రత్యేక బిరియాని తయారు చేశారు. అలాగే బంగారు దోశలను, స్వీట్లు తయారు చేసిన వారు కూడా ఉన్నారు. ఈమధ్య బంగారు పూతరేకులు కూడా వైరల్ గా మారాయి. పూతరేకులు లోపల పలుచని పొరలో బంగారాన్ని పోసి అమ్మారు. ఆ బంగారు పూతరేకులు ఖరీదు ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు. సింగపూర్‌లో బంగారు టీ పొడిని కూడా అమ్ముతున్నారు. ఈ టీ పొడి తో వేడివేడి టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. ఆ టీ పొడిని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. టీ ఆకులకు బంగారు పూతను పూసి అమ్ముతున్నారు. అలాగే లక్నోలో ఒక వ్యక్తి బంగారు టీని తయారు చేస్తున్నాడు. టీ తయారు చేశాక పైన పలుచటి బంగారు రేకులు వేసి అందిస్తున్నాడు.