Wifi Signals to detect human body positions: వైఫైతో జరాభద్రం… మీరేం చేస్తున్నా ఇట్టే పట్టేస్తుంది
Wifi Signals to detect human body positions: సాధారణంగా మనం వైఫైని ఇంటర్నెట్ కోసం వినియోగిస్తాం. ఒకప్పుడు ఇంటర్నెట్ వైఫై కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. డేటా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నది. దీంతో ప్రతి ఒక్కరూ వైఫైను వినియోగిస్తున్నారు. జీయో వంటి టెలికాం సంస్థలు తక్కువ ధరకు వైఫైని అందిస్తున్నాయి. వైఫై అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పనులు చక్కదిద్దుకుంటున్నారు.
అయితే, వైఫై సిగ్నల్స్‌తో కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా, మనిషి పొజిషన్స్‌ను కూడా గుర్తించగలుగుతుందని కార్నిగి మెల్లర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే, దీనికోసం వైఫై సిగ్నల్స్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేశారు. తద్వారా గదిలో మనిషి పొజిషన్స్‌ను రూపురేఖలను గుర్తించగలిగారు. మనిషి శరీర భాగాలను మ్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పవర్డ్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. దీనిని వైఫై సిగ్నల్స్‌తో కనెక్ట్ చేయడంతో మనిషి కదలికలను పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.
రెండు ఆఫ్ ది షెల్ఫ్ రూటర్‌లను వినియోగించి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ సిగ్నల్స్ రూటర్స్ ఖరీదు కేవలం రూ. 4500 మాత్రమేనని తెలిపారు. తక్కువ ఖర్చుతో మనిషి శరీర భాగాలను మ్యాపింగ్ చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఇలా మ్యాపింగ్ చేయడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, మనిషి ప్రైవేట్ లైఫ్‌కు ఇబ్బందులు వస్తాయని, ప్రతి ఒక్కరూ నిఘా పెట్టేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని కొందరి వాదన.
నిఘా కోసం ప్రభుత్వాలు, ప్రవైట్ సంస్థలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. కానీ, ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా తక్కువ ఖర్చుతోనే నిఘా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని, ఇది సంతోషించాల్సిన విషయమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరికొత్తగా రూపొందించిన వైఫై సిస్టమ్ మనిషి రూపురేఖలను మాత్రమే పసిగడుతుందని, ఫొటోలను, వీడియోలను తీయలేదనిశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం ఏ విధంగా అయితే అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిందో, నిఘా వ్యవస్థకూడా తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలాంటి మ్యాపింగ్ వ్యవస్థ వైద్యరంగంలోని వారికి బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రోగులు ఇంటికి వెళ్లిన తరువాత వారి వివరాలను తెలుసుకునేందుకు సీసీటీవీ లేదా వెబ్‌క్యామ్ లేదా సీసీటీవీలను వినియోగిస్తున్నారు. దీని వలన పేషెంట్‌కు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కానీ, ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, రోగుల శరీరభాగాలను మ్యాపింగ్ చేయడం ద్వారా వారి కదలికలను బట్టి రోగులకు వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
వారి అనుమానాస్పద కదలికలను ఈజీగా గుర్తించి చికిత్స అందించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిఘా కోసం ఇతరులపై ఆధారపడకుండా ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది కనుగొనే సరికొత్త ఆవిష్కరణల్లో ఇదికూడా ఒకటిగా నిలుస్తుందని కాగ్నిర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.