Amrabad Forest: ఆకట్టుకుంటున్న అమ్రాబాద్ అందాలు
Amrabad Forest: చాలామందికి అడవిని చూడాలని.. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను, పక్షులను దగ్గరగా వీక్షించాలని ఉంటుంది. వీలయితే కెమెరాలతో.. అదీ కుదరకపోతే తమ కళ్లతోనే ఆ ఆహ్లాదకరమైన దృశ్యాలను బంధించాలని ఆరాటపడుతుంటారు. అలంటి సుందరీకరమైన ఫారెస్ట్ తెలంగాణలోని అమ్రాబాద్ అడవి. ఈ అమ్రాబాద్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవగానే ప్రకృతి రమణీయతతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. ఎటుచూసినా దట్టమైన చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. జంతువుల సందడి కనిపిస్తూ ఉంటాయి. అలాగే అదే అడవిలో దాదాపు 10 కిలోమీటర్ల దూరం వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి చూడగానే కొత్త అనుభూతి ఎదురవుతుంది. ఎక్కడ చూడని విధంగా చూపరులను ఆకట్టుకుంటుంది. ఇలాంటివారి కోసమే అమ్రాబాద్ అటవీశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్‌గా సఫారీని ఏర్పాటు చేయడంతో పాటు..ఫారెస్ట్‌లో కెమెరాలు బిగించి లైవ్‌లో చూసే అనుభూతిని కలిగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతేకాదు అడవిలో ఎన్ని జంతువులు ఉన్నాయి.. ఏ జంతువులు ఎన్ని ఉన్నాయన్న లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అమ్రాబాద్ ఫారెస్ట్ అధికారులు.
ఇండియాలోనే అతి పెద్ద రెండవ ఫారెస్ట్ ఇది.ఇది 2611 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ లో ఎక్కువ సంఖ్యలో పులులకు నెలవైన ప్రదేశంగా అమ్రాబాద్ గురించే మాట్లాడతారు. గతంతో పోల్చుకుంటే పులుల సంఖ్య పెరిగింది. 2019 సంవత్సరంలో 12గా ఉన్న పులుల సంఖ్య .. తాజా రిపోర్టులో 32కి పైగా చేరింది. దాదాపు 50కి పైగా వన్యప్రాణులు అటవీ అధికారులు గుర్తించారు. అంతేకాదు మచ్చల జింకలు, సాంబార్, నీలగై, నాలుగు కొమ్ముల జింక, చింకారా వంటి అటవీ జంతువులు ఈ ఫారెస్ట్‌కు స్పెషల్ అట్రాక్షన్ అంటారు. వీటితో పాటు మల్టీ కలర్ పుట్టెలు,యూరప్ నుంచి వచ్చిన రేర్ బర్డ్స్ కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ అనేక జాతుల వృక్ష, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉందనే పేరుంది.
అటవీ అందాలు చూడటానికి వెళ్లే వారికి అటవీ శాఖ ప్రత్యేకంగా సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అమ్రాబాద్ వెళ్లగానే ప్యాకేజీలో భాగంగా ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మన్ననూర్ సీబీఏటీ చేరుకోవాలి. ఆర్డర్ ప్రాతిపదికన ఇక్కడి చింకారా హాల్‌లో లంఛ్ చేయొచ్చు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి ఎగ్జిబిషన్, షార్ట్ మూవీ ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య జంగిల్ సఫారీ ఉంటుంది. ఇందుకోసం 4 గంటలకు రిసెప్షన్ వద్ద రిపోర్ట్ చేయాలి. 8 గంటల వరకు చింకారా హాల్‌కు తిరిగి వస్తారు. 8 గంటలకు రాత్రి భోజనం చేస్తారు. 9 గంటలకు రాత్రి బస చేస్తారు. అక్కడ లోకల్‌గా ఉండేవారే టూరిస్ట్ గైడ్స్‌గా కనిపిస్తూ ఉంటారు. ఈ అడవి గురించి అందులోని జంతువులు, పక్షులు గురించి టూరిస్ట్ గైడ్స్ పర్యాటకులకు వివరంగా వివరిస్తారు.
ఈ అడవిలో రకరకాల పాములు,రకరకాల జంతువులు,పక్షులు ఉన్నా.. అవి ఎప్పుడూ హాని చేయవట. అయితే వీటిలో దేనికి విషం ఎక్కువగా ఉంటుంది.. జంతువుల ఆరోగ్యం ఎలా ఉంది వంటివి తెలుసుకోవడానికి వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ అడవిలో వేరే జంతువులు ఏమేమి ఉన్నాయి వంటివి తెలుసుకోవడానికి అడవిలో చెట్లకి ట్రాప్ మానిటరింగ్ వ్యవస్థ తీసుకువచ్చారు. అక్కడి చెట్లకు సెన్సార్ కెమెరా పరికరం అమర్చడంతో.. దీనికున్న సెన్సార్ వల్ల కెమెరా ముందు ఏ జంతువు వెళ్లినా రాత్రి సమయాల్లో కూడా ఫొటో తీస్తుంది. దీనిని రెండు, మూడు రోజులకు ఒకసారి అధికారులు చెక్ చేస్తారు.
దాదాపు 300 కెమెరాలతో ప్రత్యేకంగా ట్రాప్ మానిటరింగ్ చేసారు. మొత్తంగా అమ్రాబాద్ అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడంతో తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అమ్రాబాద్ ఫారెస్ట్ చక్కని ప్రదేశం. వీలైతే ఒక్కసారి వెళ్లి విజిట్ చేసినవారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు. ఇక పర్యాటకులకోసమే స్పెషల్ కాటేజీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నాగర్‌కర్నూల్ జిల్లాలో సమీప పట్టణమైన వనపర్తి నుండి 75 కి. మీ. దూరం ప్రయాణిస్తే అందమైన అమ్రాబాద్ మీకు స్వాగతం పలుకుతుంది.