Cock Fights: కోళ్లపందాలు సంప్రదాయమా..వ్యసనమా
Cock Fights: తెలుగు రాష్టాల్లో సంక్రాంతి కళ వచ్చేసింది. ఇక మనుషుల కంటే హడావిడి.. ఈ పండగ రోజుల్లో కోళ్ళదేహవా.. వందల కోట్లు చేతులు మారతాయి. ముసుగేసుకున్న నల్ల డబ్బుకు రెక్కలొచ్చేస్తాయి. ఆంధ్రోళ్ళేకాదు. తెలంగాణ,మహరాష్ట్ర కర్నాటక , పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కోళ్ళ పందాలకోసం కోస్తాకు క్యూ కడతారు. ఇందులో ఎక్కువగా రాజకీయనాయకులే ఉండడం గమనార్హం. పండగ మూడు రోజులుకోస్తా తీరంలోని పచ్చని తోటలన్నీ ఓపెన్ బార్లుగా, రెస్టారెంట్లు గా, వైన్ షాపులుగా మారుతాయి. అలాగే మినీ ఎటిఎం లు కూడా వెలుస్తాయి. ఒక చిన్న పల్లెటూళ్ళో హైటెక్ హంగులతో ఈ కోడిపందాలు నిర్వహిస్తారు. సంక్రాంతికి ఆరునెలలముందునుండే కోళ్లను మచ్చిక చేసుకుంటారు. కాయ్ రాజా…కాయ్..అంటూ పందాలు షురూ చేస్తారు. మానవుడు కూడా తిననంతగా కోళ్లకు తినిపిస్తారు. పిస్తా,బాదం,జీడిపప్పు అప్పుడప్పుడు వైన్, విస్కి వంటి మద్యం కూడా పట్టిస్తారు.
కోడి కాలు దువ్వినా, కూత కూసినా కోడి పందెం అనగానే చప్పున గుర్తొచ్చేది పల్నాటి యుద్ధం. బ్రహ్మ నాయుడి చిట్టిమల్లు… నాగమ్మ సివంగిల పోరు, యుద్ధానికి దారితీసిన తీరు… కథలు కథలు తెలుగునాట సుప్రసిద్ధమే. ఈ కోడి పందేలు సంక్రాంతితో ఎలా ముడిపడ్డాయో స్పష్టంగా చెప్పలేము కాని, సంప్రదాయం పేరుతో… వినోదం మాటున క్రమంగా జూద క్రీడగా మాత్రం మారింది. కన్నబిడ్డల మీదనైనా మమకారం చూపిస్తారో లేదోకానీ..ఈ కోళ్ళ యజమానులు కోళ్ళను ప్రాణానికిప్రాణంగా చూసుకుంటారు.కోడిపుంజేకదా అని తేలిగ్గా తీసుకోకండి.పండగ పందాల కోసమేప్రత్యే ప్రత్యేకంగా పెంచేఈ కోడిపుంజులుఈ సీజన్లో లక్షల ధరపలుకు తాయి.ఒక్కో కోడిపుంజు మీద కోట్ల రూపాయలపందాలు కాస్తారు. ఇది మన సంస్కృతి అని చెబుతున్నప్పటికీ సంక్రాంతి ముందునుంచే లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటిపై నిషేధం వుండటంతో…ఆన్‌లైన్ కోడిపందేలు ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది. రూ.500 నుంచి లక్షల్లో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఒకప్పుడు పండుగ సమయంలోనే కోడిపందేలు నిర్వహించేవారు. ఆన్‌లైన్‌లో ఏడాది పొడవునా పందేలు నడుపుతున్నారు.
పందెంలో కోడికాళ్ళకు సుమారు ఓ జానెడు పొడవ గలకత్తి కట్టి పందానికి ఉసి గొలుపుతారు. కాళ్ళతో తన్నుకుంటూ అవి చిన్న సైజు యుధ్ధమేచేస్తాయి.మధ్య మధ్యలోఅలసటవస్తే వాటిని పక్కకు తీసినీళ్ళు పట్టిస్తారు. ఓ కోడికత్తి ఎదుటికోడిని చీల్చి చెండాడుతుంటే రక్తం కారుతూ బాధకు ఓర్చుకోలేక గిలగిల్లాడేకోళ్ళను చూస్తూ పందెం రాయుళ్లు సవాళ్ళను విసురుతారు. ఈ కోళ్ళపందాలకు పూర్వచరిత్రవుందని తెలుస్తుంది. గ్రీసు దేశంలో క్రీ.పూ5వ శతాబ్ది నుంచే కోడిపందాలున్నట్లు చరిత్ర చెబుతోంది. తొలిసారిగా దశ కుమార చరిత్రలో ఈ కోడిపందాలను ప్రస్తావించాడు. మొత్తానికితెలుగువారిక్రీడా వినోదాల్లో కోడిపందాలు. కూడా ఒకటిగా చోటుచేసుకున్నాయన్నదినిజం.
కోడిపందాలే కదా అని తేలిగ్గా చూడద్దు. కోడిపందాల్లో రాజ్యాల్ని సైతం కోల్పోయిన ఉదంతాలున్నాయి. కోటీశ్వరులు నిరుపేదలుగా- నిరుపేదలు కోటీశ్వరులులుగా మారేది ఈ పందాలవల్లే. కత్తులతో రక్తపాతం జరుపుతుంటే చూసి రాక్షసానందం పొందుతున్నాం. సాంప్రదాయాల పేరిట జరిపేఈ తంతును నిలపడానికికోర్టులు ముందుకొచ్చినా…దొడ్డిదారిన ఈ తతంగానికిమళ్ళీ ప్రాణం పోస్తున్నాం. రాజకీయ లబ్దితో ఓట్లకోసం మన రాజకీయ నాయకులు చేసే ఈ విన్యాసాలు మూగజీవాల పాలిట మృత్యుకుహరంలా తయారవుతున్నాయి. ఇది ఒక వ్యసనంలా మారింది..కానీ దీన్నే మన సంప్రదాయం అంటున్నాం.