New Jobs in 2023: కొత్త ఏడాదిలో ఎటువంటి ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉందో తెలుసా?
New Jobs in New Year
కాలం మారుతోంది. కాలానికి అనుగుణంగా కొలువులు కూడా మారుతున్నాయి. కొత్త కొత్త కొలువులు పుట్టుకొస్తున్నాయి. ఎందరికో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కొత్త ఏడాదిలో అటువంటి కొత్త ఉద్యోగాల గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హెల్త్ కేర్ పర్సన్
దేశంలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. తద్వారా బాధ పడుతున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోగులకు సేవలు చేసే వారికి డిమాండ్ పెరుగుతోంది. అదొక ఉద్యోగ అవకాశంగా మారుతోంది. గతంలో ఇటువంటి ఉద్యోగాలు అరకొరగా ఉండేవి. కరోనా వచ్చిన నాటి నుంచి ఇటువంటి హెల్త్ కేర్ పర్సనల్ ఉద్యోగాలకు డిమాండ్ ఊపందుకుంది. రోగులకు సహకరించే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కొద్ది పాటి ట్రైనింగ్ తీసుకుని, కొన్ని ఏజెన్సీల ద్వారా ఇటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్
సోషల్ మీడియా వాడకం పెరిగిన నాటి నుంచి డిజిటల్ కంటెంట్ విభాగం పరుగులు పెడుతోంది. వివిధ సంస్థలకు వీరి అవసరం తప్పనిసరి అవుతోంది. దీంతో కంటెంట్ సరిగ్గా అందించే వారి కోసం సంస్థలు ఎదురు చూస్తున్నాయి. అటువంటి వారి కోసం మంచి జీతాలు అందిస్తున్నాయి. వారి సేవలను వినియోగించుకుంటున్నాయి.
టాలెంట్ మేనేజర్స్
టాలెంట్ మేనేజర్స్ ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఒక సంస్థ ఎదుగుదలకు ఈ టాలెంట్ మేనేజర్లు పనిచేస్తారు. సంస్థలో పని చేస్తున్నఉద్యోగులను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు వీరు కృషి చేస్తారు. అవరసమైన సమయంలో వారికి స్పెషల్ ట్రైనింగ్ వంటివి ఏర్పాటు చేసి వారిని మెరికల్లా తయారు చేస్తారు. సంస్థపై ఉద్యోగులకు మరింత నమ్మకం, ఇష్టం కుదిరేలా చేస్తారు.
యానిమల్ కేర్ టేకర్
ధనవంతులు అనేక మంది తమ ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే వాటిని అదే పనిగా కనిపెట్టుకుని ఉండాలంటే సాధ్యం కాని పని. అటువంటి వారికి యానిమల్ కేర్ టేకర్స్ అవసరం ఉంటుంది. పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి ఏం సమయంలో ఏం చేయాలనే విషయం యజమానుల నుంచి తెలుసుకుంటూ పనులు చేయల్సి ఉంటుంది. యానిమల్ కేర్ టేకర్లుగా పని చేసేవారికి ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది. విద్యార్హతలు ఎక్కువ లేకపోయినా, పెంపుడు జంతువుల పట్ల ప్రేమగా మెలిగే విధానం తెలిస్తే ఇటువంటి పని చేయడం సాధ్యపడుతుంది.
వాకర్స్ ఫర్ ఎల్డర్స్
ప్రతి ఇంట్లోను వృద్ధులు ఉంటారు. వారిలో కొందరే ప్రతి రోజూ బయటకు వెళ్లగలుగుతారు. ఇంట్లో ఎవరైనా బయటకు వెళితే వారితో వెళ్లడమే తప్ప స్వతహాగా బయటకు వెళ్లలేని పరిస్థితి. వయసు మీద పడడంతో శరీరం సహకరించక ఇంట్లోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. కొందరు ధనవంతులు ఇటువంటి దుస్థితి నుంచి బయటపడుతున్నారు. వయోవృద్ధులకు సాయం చేసే పనివాళ్లు దొరుకుతున్నారు. వారిని పార్కులకు తీసుకువెళ్లడం, సినిమా హాళ్లకు తీసుకువెళ్లడం వంటివి చేస్తున్నారు. తద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు.
వీటితో పాటు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎనలిస్టు, లాజిస్టిషియన్, డేటా సైంటిస్టు, వెబ్ డెవలపర్, పర్సనల్ ట్రైనర్, బ్లాక్ చైన్ డెవలపర్, రీసెర్చ్ అనలిస్టు వంటి ఉద్యోగాలకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది.