Astronaut Aldrin : వేలంలో షాకింగ్ ధర పలికిన ఆల్డ్రిన్ జాకెట్
Astronaut Aldrin’s Flight Jacket Auction : చారిత్రాత్మక అపోలో 11 మిషన్ కోసం మాజీ అమెరికన్ వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ ధరించిన ఇన్‌ఫ్లైట్ కవరాల్ జాకెట్ మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన వేలంలో $2.7 మిలియన్లకు విక్రయించబడిందని వేలం సంస్థ సోథెబీస్ తెలిపింది. అంటే మన కరెన్సీలో సుమారుగా 22 కోట్లు. 1969 జూలై 16న ముగ్గురు వ్యోమగాములు చంద్రునిపైకి ప్రవేశించారు. అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్ జూలై 20, 1969న చంద్రునిపై దిగింది. చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఈ మిషన్ లో బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ కూడా ఉన్నారు. చంద్రుని ఉపరితలంపై కాలు మోపిన రెండవ వ్యక్తి ఆల్డ్రిన్. ప్రస్తుతం ఆల్డ్రిన్ వయసు 92 ఏళ్ళు. ఈ మిషన్ లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులలో ప్రస్తుతానికి జీవించి ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే.
మూన్ పై అడుగుపెట్టే సమయంలో ఆల్డ్రిన్ ధరించిన ఈ తెల్లటి జాకెట్‌పై అమెరికా జెండా, NASA మొదటి అక్షరాలు, అపోలో 11 మిషన్‌కు సంబంధించిన ప్యాచ్, “E. ALDRIN” అనే పేరు ఉన్నట్లు సమాచారం. ఆల్డ్రిన్ అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్న వస్తువుల వ్యక్తిగత సేకరణలో ఈ జాకెట్ ఒక భాగం. ఆయన అసలు పేరు ఎడ్విన్ యూజీన్ ఆల్డ్రిన్ జూనియర్. అందువల్ల జాకెట్ పై “E. ALDRIN” అనే పేరు ఉంది. జాకెట్ కోసం బిడ్డింగ్ తొమ్మిది నిమిషాల పాటు కొనసాగింది.