India’s tourism sector: అభివృద్ధి బాటలో పయనిస్తున్న భారత పర్యాటక రంగం
Indian tourism Sector is achieving Mega growth
భారతదేశంలో టూరిజం రంగం అభివృద్ధి బాటలో నడుస్తోంది. గత ఏడాది ఈ రంగం మరింత అభివృద్ధిని చూసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో అనేక మంది టూరిస్టులు, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఆనందించారు. మరపురాని అనుభూతిని సొంతం చేసుకున్నారు.
వర్క్ ఫ్రమ్ ఏనీ వేర్.. ఎక్కడనుంచైనా పని చేసుకునే సౌకర్యం కలిగిన ఉద్యోగులు అధిక శాతం మంది దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి టూరిస్ట్ స్పాట్స్ లో కూడా వర్క్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క పర్యాటక ప్రాంతాలను ఆస్వాదిస్తునే మరో పక్క తాము చేయాల్సిన పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఏకకాలంలో రెండు పనులను పూర్తి చేస్తున్నారు.
ప్రకృతిని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. పురుషులతో పాటు స్త్రీలలో కూడా టూరిజం స్పాట్లలో ఎంజాయ్ చేయాలని కోరుకునే వారు అనేకం ఉన్నారు. మన దేశంలో చాలా పర్యాటక ప్రాంతాల్లో చాలా కాలంగా స్త్రీలకు సౌకర్యవంతమైన సదుపాయాలు లేవు. ఈ కొరతను గుర్తించిన అధికారులు ఇటీవల కాలంలో స్త్రీలకు సౌకర్యవంతంగా అనేక మార్పులు చేపట్టారు. వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టూరిజం స్పాట్లలో సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో మహిళా టూరిస్టుల సంఖ్య కూడా రాను రాను పెరుగుతోంది.
మన దేశంలో ఎన్నో హెరిటేజ్ ప్రాంతాలు పర్యాటకులను ప్రతి ఏటా అలరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా అనేక మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాది బాగా పెరిగింది.