Immunity-Boosting Fruits:రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు ఏమిటో తెలుసా?
వర్షాలు దంచికొడుతున్నాయి. కొత్త కొత్త రోగాలు ప్రజలను వణికిస్తున్నాయి. భయాన్ని పెంచుతున్నాయి. ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకునేలా ప్రేరేపిస్తున్నాయి.
ఎండాకాలం ఎప్పుడు పోతుందా వానాకాలం ఎప్పుడు వస్తుందా అని చాలా కాలం ఎదురుచూశాం. అనుకున్నట్లుగానే వానాకాలం వచ్చేసింది. వస్తూ వస్తూనే ప్రజల జీవితాలలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి టీలు తాగుతూ, వేడి వేడి పకోడీలు తింటూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇటువంటి వాతావరణంలో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిపుణులు సూచిస్తున్న ఆహారపదార్ధాలు
రోగ నిరోధన శక్తి పెరగడానికి నిపుణులు 5 రకాల ఫ్రూట్స్ ను సూచిస్తున్నారు. వారు సూచించిన వన్నీ మనం రోజు సాధారణంగా చూస్తున్నవే. మనకు విరివిగా లభించేవే. అయితే ఈ వాతావరణ పరిస్థితుల్లో వాటిని తప్పని సరిగా తినాలని సూచిస్తున్నారు. అవేమంటే..
నేరేడు పండ్లు
ఈ సీజన్లో నేరేడు పండ్లు తప్పని సరిగా తీసుకోవాలి. ఇది పోషకాల గని. వాటిలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి లభ్యమౌతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్య ప్రదాయినిగా దీనిని భావిస్తారు.
యాపిల్ పండ్లు
యాపిల్ పండ్లు కూడా శరీరానికి ఎంతో సహకరిస్తాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. ఇంగ్లిష్‌లో ఓ ఫేమస్ కొటేషన్ కూడా ఉంది. An apple a day Keeps doctor away. అంటే రోజుకు ఓ ఆపిల్ పండు తింటే డాక్టర్ల అవసరం లేదు అని దాని అర్ధం. యాపిల్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్వెర్సెటిన్ అనే ఫ్లావినోయిడ్స్ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. రోగాలను తరిమేస్తాయి.
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక మంది పోషకార నిపుణులు దానిమ్మను తరచుగా తినమని సూచిస్తున్నారు. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయన హామీ స్పష్టంగా చెబుతున్నారు.
అరటి పండ్లు
అరటిపండ్లలో B6 అధికంగా ఉంటుంది. ఈ B6 మన ఆహార వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మామూలుగా తినడంతో పాటు ఎన్నో రకాల ఆహార పదార్ధాలలో కలిపి అరటిపళ్లు తినవచ్చు.
బేరి పండ్లు
బేరి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్‌తో పాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కూడా అధికంగా లభ్యమౌతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఫ్లేవనోయిడ్స్ అధికంగా ఉంటాయి. ఆ పండ్ల తొక్కలలో కూడా అధిక పోషకాలు ఉంటాయి.