ప్రపంచంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. అందులో ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్.
Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కేవలం ధూమపానం (Smoking) చేసే వారిలోనే కాదు, ధూమపానం చేయని వారిలో కూడా వస్తోంది. పొగ తాగే వారి పక్కన నిల్చుని ఆ పొగను (Smoke) పీల్చినా కూడా ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో ఈ క్యాన్సర్ (Cancer) బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రారంభంలో పెద్దగా లక్షణాలను, సంకేతాలను ఇది చూపించదు. ప్రారంభ దశలోనే ఏ క్యాన్సర్ నైనా గుర్తించడం ముఖ్యం. లేకుంటే అది తీవ్రమయ్యాక ప్రాణాలను తీసుకుంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యులను కలిసి క్యాన్సర్ ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం.
1. దగ్గును చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు తేలికగా తీసుకోకూడదు. ఈ దగ్గు మూడు వారాల కంటే ఎక్కువ కాలం మిమ్మల్ని వేధిస్తే అది ఊపిరితిత్తులు క్యాన్సర్ వల్లనేమో అని అనుమానించాలి. ఉదయాన లేచిన వెంటనే పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు కచ్చితంగా వైద్యులను కలవాలి. ఎందుకంటే క్యాన్సర్ బాధపడుతున్న వారిలో 65% మందికి పొడి దగ్గు సమస్య ఉంది.
2. దగ్గుతున్నప్పుడు గొంతు నుంచి కఫం వస్తుంది. ఈ కఫంలోగాని రక్తం కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. అది ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంకేతం. ఈ కఫం చాలా మందంగా ఉంటుంది.
3. ఉదయం లేచిన వెంటనే చెమట పడుతున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే క్యాన్సర్ ఉన్న రోగులకు చెమట పడుతుంది.
4. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన రోగులు ప్రారంభ దశలో తరచూ జ్వరం బారిన పడుతూ ఉంటారు. అకారణంగా జ్వరం వస్తున్నప్పుడు వైద్య పరీక్షలు చేయించడం ఉత్తమం. ఇలా జ్వరం రావడానికి కారణం ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితులు పెరుగుతూ ఉండడమే.
5. శ్వాస తీసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించడం, దగ్గుతున్నప్పుడు గొంతు నొప్పి రావడం, తీవ్రంగా అలసట రావడం, ఆకలి లేకపోవడం, బరువు అకారణంగా తగ్గిపోవడం, ఆహారం మింగేటప్పుడు గొంతు నొప్పి రావడం, స్వరం మారడం, ఛాతీలో నొప్పి రావడం, మెడ దగ్గర వాపు రావడం ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతం.