Harmful effects of mobile phones: ప్రయాణాల్లో మొబైల్ ఫోన్‌ను ఇలా వినియోగిస్తున్నారా…జరభద్రం
Harmful effects of mobile phones: ఈ కాలంలో మొబైల్ ఫోన్ లేకుండా మనిషి జీవితం ఊహించుకోవడం చాలా కష్టం. మొబైల్ ఫోన్లను అవసరానికి మించి వినియోగిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు పక్కన మొబైల్ ఉండాల్సిందే. ప్రయాణం చేసే సమయంలోనూ పదేపదే ఫోన్లు చూసుకుంటుంటారు. ఇది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో పదేపదే తీక్షణంగా మొబైల్ ఫోన్లను చూసినపుడు మొబైల్ స్క్రీన్ ఎఫెక్ట్ కంటిపై పడుతుందని ఫలితంగా రెటీనా దెబ్బతింటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇక, ఎండ, వేడి ఉన్న ప్రాంతాల్లో కూడా మొబైల్ వినియోగం తగ్గించాలని సూచిస్తున్నారు. ఎండ ఉండే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లను చూడటం వలన సూర్యకిరణాలు స్క్రీన్‌పై పడి, తిరిగి అవే కిరణాలు పరావర్తనం చెంది కళ్లపై పడతాయి. మొబైల్ స్క్రీన్ నుండి పరావర్తనం చెందిన ఈ కిరాణాల్లో రెటీనాను దెబ్బతీసే యూవీ కిరణాలు ఉంటాయని, పదేపదే ఇలా చూడటం వలన అంధత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. ప్రయోగాత్మకంగా కూడా ఇది నిరూపితమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఎండలో కూర్చొని మొబైల్ ఫోన్లు చూడటం వలన సోలార్ మాలిక్యులోపతి, మాలిక్యులర్ డీజనరేషన్ అనే వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెటీనా వెనుక భాగంలో సున్నితమైన మాక్యులా ఉంటుంది. ఇది స్క్రీన్ నుండి వచ్చే కిరణాల వలన ప్రభావితమయ్యి దెబ్బతింటుంది. ఈ మాక్యులా దెబ్బతింటే అంధత్వం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలోనే కాదు, ఇంటివాతావరణంలోనూ తదేకంగా మొబైల్ స్క్రీన్‌ను చూడటం కూడా డేంజరే. గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌లను చూడకుండా వీలైనంత వరకు కట్టడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తదేకంగా మొబైల్ ఫోన్లు చూస్తుండటం వలన మొదటగా ఏకాగ్రత దెబ్బతింటుంది. అపై మెదడులోని సెరిబెల్లమ్ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లకు మెదడుకు ఉన్న సంబంధం క్రమంగా దెబ్బతింటుంది.
ఇది కంటిచూపుకు మాత్రమే కాకుండా జీవితానికి కూడా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్‌ను పదేపదే చూస్తూ ఉండటం వలన కాలర్‌బోన్స్‌పై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెడనొప్పులు వస్తాయి. ఆలోచనా శక్తి మందగిస్తుంది. శారీరకంగా ఇబ్బందులు ఎదురైతాయి. అంతేకాదు, సంతానోత్పత్తిపై కూడా మొబైల్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్లను తరచుగా వినియోగించే వారికి సంతానం కలిగే అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. లైఫ్‌స్టైల్లో మార్పులు కూడా ఇందుకు ఒక కారణం.
నిరంతరం ఒత్తిడితో కూడిన పనులు చేస్తుండటం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. వీటికి మొబైల్ వినియోగం కూడా అధికం కావడంతో రాబోయే రోజుల్లో సంతానోత్పత్తి శాతం తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్కింగ్ సమయాల్లో తప్పించి వీలైనంత వరకు మొబైల్ వాడకం తగ్గించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లిన సమయంలో మొబైల్ ఫోన్ తప్పనిసరిగా చూడాల్సిన అవసరం వస్తే సన్‌గ్లాసెస్ వినియోగించాలని అదీ కూడా కొద్దిసమయం మాత్రమే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.