1950లలో భారత్‌లో మహిళలు రెజ్లింగ్ చేయడమంటే ఆషామాషీ కాదు. ఆ కాలంలోనే హమీదా బానో మగ కుస్తీ యోధులకు కూడా సవాల్ విసిరేవారు.
Hamida Banu : 1950లలో భారత్‌లో మహిళలు రెజ్లింగ్ చేయడమంటే ఆషామాషీ కాదు. ఆ కాలంలోనే హమీదా బానో(Hamida Banu) మగ కుస్తీ యోధులకు కూడా సవాల్ విసిరేవారు(The First Woman Wrestler).‘‘కుస్తీలో నాపై పైచేయి సాధిస్తే, వారిని నేను పెళ్లి చేసుకుంటా’’ అని 32 ఏళ్ల బానో చెప్పేవారు.ఆమెతో పోరాడేందుకు 1954 ఫిబ్రవరిలో పటియాలా నుంచి ఒకరు, కోల్‌కాతా నుంచి మరొక పహిల్వాన్(pahilawan) రావడం. అయితే, వారిద్దరినీ ఆమె చిత్తుగా ఓడించారు.అదే ఏడాది మే నెలలో మూడో దంగల్(dangal) కోసం ఆమె వడోదర కూడా వెళ్లారు.ఆమె పర్యటన అక్కడ సంచలనంగా మారింది. 80 ఏళ్ల సుధీర్ పరబ్ అప్పట్లో స్కూలులో చదువుకుంటున్నారు. బానో గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ కుస్తీ చూడటానికి చాలా మంది వచ్చారు. అసలు ఇలాంటి కుస్తీ గురించి మునుపెన్నడూ మేం వినలేదు’’ అని అన్నారు.
పురాతన గ్రీసులో కుస్తీ(kusthi ) పోటీలను చూడటానికి వచ్చే వారి కోసం చేసినట్లుగానే అక్కడికి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ కుస్తీ పోటీని చూడాలనే ప్రేక్షకుల ఉత్సాహాన్ని కొన్ని సెకన్లలోనే హమీదా బానో పటాపంచలు చేశారు.కేవలం ఒక నిమిషం 34 సెకన్లలోనే ప్రత్యర్థి బాబా పహిల్వాన్‌ను ఆమె చిత్తుగా ఓడించారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ అప్పట్లో వెల్లడించింది.దీంతో హమీదా బానోను పెళ్లి చేసుకోవాలనే బాబా పహిల్వాన్ కల ఆవిరైంది. ఆ తర్వాత ఇదే తన చివర్ మ్యాచ్ అని బాబా ప్రకటించారు కూడా.భారత్‌లోని తొలి మహిళా రెజ్లర్‌గా అప్పట్లో హమీదా బానో మన్ననలు పొందారు. మహిళలు బలహీనంగా ఉంటారనే వాదన తప్పని ఆమె నిరూపించారు. కానీ, అప్పట్లో రెజ్లింగ్‌ను కేవలం పురుషుల గేమ్‌గా భావించేవారు.
అలీగఢ్ నుంచి
సాధారణ ప్రజల్లో హమీదా బానోకు((Hamida Banu) ) విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆమె బరువు, ఎత్తు, తీసుకునే ఆహారంపై తరచూ వార్తలు వస్తుండేవి.అప్పట్లో వచ్చే వార్తల ప్రకారం, ఆమె బరువు 107 కేజీలు. ఎత్తు 5.3 అడుగులు.రోజూ ఆమె ఐదున్నర లీటర్ల పాలు, మూడు లీటర్ల సూప్, రెండున్నర లీటర్ల జ్యూస్, ఒక కోడి, కేజీ మటన్, ఆరు గుడ్లు, 450 గ్రాముల బటర్, ఒక కేజీ బాదం పప్పులు, రెండు పెద్ద రోటీలు, రెండు ప్లేట్ల బిర్యానీ ఆహారంగా తీసుకునేవారు.రోజుకు ఆరు గంటల పాటు వ్యాయామం చేసేవారట. తొమ్మిది గంటల పాటు నిద్రపోయేరట.అప్పట్లో ఆమెను ‘‘అలీగఢ్ కా అమెజాన్’’ అనే పేరుతో కూడా పిలిచే వారు. మీర్జాపుర్‌లో పుట్టిన హమీదా కుస్తీలో శిక్షణ కోసం అలీగఢ్‌కు వెళ్లడం. అక్కడ సలాంగా పిలిచే రెజ్లర్ దగ్గర శిక్షణ తీసుకుంది.1950లలో బానోను ప్రశంసిస్తూ ఒక రచయిత ప్రత్యేక కథనం రాశారు. ‘ అలీగఢ్ కా అమెజాన్ మీ వెన్ను విరగ్గొట్టగలదు’ అని ఆ కథనానికి శీర్షిక పెట్టారు. అప్పట్లో అమెరికా ప్రముఖ రెజ్లర్లలో అమెజాన్ ఒకరు. హమీదా బానోను అందరూ ఆమెతో పోల్చేవారు.‘‘వీరిని మహిళలు ఎవరూ ఢీ కొట్టలేకపోయేవారు. దీంతో మగవారిపైనా వీరు సవాల్ విసిరేవారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.తనతో పోరాడేవారు ఎవరూ లేకపోవడంతోపాటు సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష వల్లే ఆమె ఇల్లు వదిలి అలీగఢ్‌కు వెళ్లిపోయారని హమీదా బానో బంధువులు చెప్పడం జరిగింది.
లారీలపై హమీదా బానో పోస్టర్లు..
1950లలో హమీదా బానో కెరియర్ పతాక స్థాయిలో ఉంది. 1954లో అయితే, తను పాల్గొన్న 320 కుస్తీ పోటీల్లో అన్నింట్లోనూ గెలిచానని ఒక వార్తా సంస్థతో ఆమె చెప్పారు. ఆమెకు ప్రజల్లో ఉండే ఆదరణ అప్పటి వార్తల్లో కనిపించేది. మరోవైపు కొత్త రెజ్లర్లు ఏదైనా పోటీలో గెలిస్తే, వారిని హమీదా బానోతో పోల్చేవారు.ఈ అంశాలే వడోదర ప్రజల్లో చాలా ఆసక్తిని రేపాయి. ‘‘అది చాలా భిన్నమైన పోటీ. ఎందుకంటే మేం తొలిసారిగా ఒక పురుషుడితో ఒక మహిళ కుస్తీ పోటీలో పాల్గొనడాన్ని చూశాం’’ అని సుధీర్ పరబ్ చెప్పారు.‘‘1954లో ప్రజల ఆలోచనా విధానాలు మూసధోరణిలో ఉండేవి. ఇలాంటి పోటీ ఒకటి జరుగుతుందని వారు ఊహించలేదు. ఆమె నగరంలోకి రాబోతున్నారని బ్యానర్లు, పోస్టర్లు కట్టారు. లారీలపైనా ఈ పోస్టర్లు కనిపించేవి’’ వడోదరలో బాబా పహిల్వాన్‌ను ఆమె చిత్తుగా ఓడించినట్లు అప్పట్లో అన్ని పత్రికల్లోనూ వచ్చింది.‘‘నిజానికి మొదట లాహోర్‌కు చెందిన ఒక చిన్న పహిల్వాన్‌తో ఆమె పోటీ పడాల్సి ఉండగా. కానీ, హమీదా బానోతో పోటీపడనని ఆయన చివరి నిమిషంలో వెనకడుగువేశారు. ఆయన స్థానంలో బాబా పహిల్వాన్ ఆమెతో తలపడ్డారు’’ అని పరబ్ చెప్పారు.కొంతమంది రెజ్లర్లు తాము మహిళలతో పోటీ పడబోమనని అప్పట్లో తెగేసి చెప్పేవారని పరబ్ వివరించారు.మరోవైపు ఒక మహిళ అందరిముందు పురుషులకు సవాల్ విసరడం, వారిని చిత్తుగా కొట్టడం ఆ రోజుల్లో చాలా మందికి నచ్చేదికాదు.
అప్పట్లో పుణెకు చెందిన నేషనల్ ట్రైనింగ్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రామచంద్ర సాలో ఇలానే బానోతో కుస్తీ పోటీని రద్దుచేసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.ఆ తర్వాత మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన శోభా సింగ్ పంజాబీ కూడా ఇలానే ఒక మగ రెజ్లర్‌ను ఓడించారు. అయితే, పోటీ తర్వాత కుస్తీ అభిమానులు ఆమెపై రాళ్లు విసిరారు.ఇదొక ఫేక్ కుస్తీ అంటూ అక్కడకు వచ్చినవారు గట్టిగా అరిచారు. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు రావాల్సి వచ్చింది. ఇలాంటి ఫేక్ కుస్తీ ఆరోపణలు హమీదా బానోపై కూడా వచ్చాయి.రచయిత రణ్విజయ్ సేన్ తన పుస్తకం ‘‘నేషన్ ఎట్ ప్లే: హిస్టరీ ఆఫ్ స్పోర్ట్ ఇన్ ఇండియా’’లో దీని గురించి ప్రస్తావించారు. ‘‘అప్పట్లో స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ కలిపి ఉండేవి. దీనిలో భాగంగానే వినోదమే ప్రధానంగా హమీదా బానోతో రెండు కుస్తీ పోటీలు నిర్వహించాలని భావించారట. వీటిలో ఒకటి అంధ రెజ్లర్‌తో మ్యాచ్ కూడా . అయితే, ఆ అంధ రెజ్లర్ పన్ను నొప్పి రావడంతో మ్యాచ్‌కు రాలేనని చెప్పారు. దీంతో ఈ పోటీలో బానోను విజేతగా ప్రకటించారు’’ అని పేర్కొన్నారు.
‘‘అయితే, కుస్తీ పోటీలపై నిషేధాన్ని తొలగించాలని అప్పటి బాంబే స్టేట్ సీఎం మొరార్జీ దేశాయ్‌ను కూడా బానో కలిశారు. అయితే, ఆ నిషేధాన్ని తాము జెండర్ ఆధారంగా విధించలేదని, దీనికి వెనుక ఇతర కారణాలు ఉన్నాయని దేశాయ్ చెప్పారు. డమ్మీ రెజ్లర్లపై గెలిచి తాము యోధులుగా కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు’’ అని సేన్ వివరించారు.‘‘ఎవరూ ఆమెను ఓడించలేదు’’మరోవైపు హమీదా బానోపై బలహీనమైన రెజ్లర్లను లేదా డమ్మీ ప్రత్యర్థులను ఉపయోగిస్తున్నారని అప్పట్లో మీడియాలో కూడా వార్తలు వచ్చేవి.దీనిపై 1987లో ప్రచురితమైన తన పుస్తం ‘‘అలాం మెయిన్ ఇత్ఖాబ్- దిల్లీ’’లో మహేశ్వర్ దయాళ్ ఈ విషయం గురించి రాశారు. ‘‘ఆమె ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్‌లలో చాలా మ్యాచ్‌లు ఆడారు. వీటిని చూసేందుకు చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారు’’‘‘అచ్చం మగవారిలానే ఆమె పోరాడేవారు. అయితే, ఆ మగ రెజ్లర్లకు, హమీదా బానోకు ముందుగానే ఒప్పందాలు జరిగేవని, వారు కావాలనే హమీదా బానో చేతుల్లో ఓడిపోయేవారని కొందరు ప్రచారం చేసేవారు’’ అని వివరించారు.
అయితే, హమీదా బానోను గొప్ప రెజ్లర్‌గా ఫెమినిస్టు రచయిత కుర్రాతుల్ ఎన్.హైదర్ అభివర్ణించారు. ‘‘ఆమెను ఎవరూ ఓడించలేదు. ఆమెతోపాటు ప్రొఫెసర్ తారాబాయి కూడా గొప్ప యోధురాలు. వీరిద్దరి ఫోటోలు ప్రకటనల్లో కనిపించేవి. వీరు కెమెరాల ముందు మెడలో భారీగా పతకాలు వేసుకొని నడుచుకుంటూ వచ్చేవారు’’అని చెప్పారు.రష్యాకు చెందిన వీర చెస్టెలిన్ను కూడా 1954లో ఒక నిమిషంలోనే హమీదా బానో ఓడించారని, ఆ తర్వాత బానో యూరప్‌కు కూడా వెళ్లారని వార్తలు వచ్చాయి.అయితే, ఆ తర్వాత రికార్డుల నుంచి హమీదా పేరు కనుమరుగైంది. కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఆమె పేరు కనిపించేది.
ఆ తర్వాత ఏం జరిగింది?
ఆ తర్వాత హమీదా బానో ఏమయ్యారో తెలుసుకునేందుకు యూరప్‌కు వెళ్లాలనే ఆలోచనతో ఆమె కెరియర్ పతనం కావడం మొదలైందని వారు చెప్పారు. ఈ విషయంపై సౌదీ అరేబియాలో జీవిస్తున్న ఆమె మనవడు ఫిరోజ్ షేక్ ఏమన్నారంటే ‘‘మా నాన్నమ్మతో పోటీ పడేందుకు ఒక విదేశీ మహిళ వచ్చింది. మా నాన్నమ్మ చేతిలో ఓడిపోయింది. యూరప్ వచ్చేయాలని మా నాన్నమ్మకు ఆమే సూచించింది. అయితే, అక్కడకు వెళ్లొద్దని ఆమె ట్రైనర్ సలాం అన్నారు. ’’ అని ఫిరోజ్ చెప్పారు.‘‘ఆమెను ఆపేందుకు సలాం కర్రతో కొట్టారు కూడా. దీంతో ఆమె చేయి విరిగింది. అయినా ఆమె యూరప్ వెళ్తానని అనేవారు’’ అని ఆయన తెలిపారు.సలాం కొట్టడంతో ఆమె కాలు కూడా విరిగిందని వీరి ఇంటి పొరుగున ఉండే రహీల్ ఖాన్ చెప్పారు. ‘‘ఆమె సరిగ్గా నిలబడలేకపోయేవారు. ఎలాగోలా కోలుకున్నారు. కానీ, మునుపటిలా నడవలేకపోయేవారు’’అని ఆయన వివరించారు. ‘‘వారిద్దర మధ్య తరచూ కొట్లాటలు జరిగేవి’’ అని ఆయన తెలిపారు.సలాం పహిల్వాన్ కూడా సినిమా స్టార్లు, ప్రముఖులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆయనకు ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉండేది. అయితే, ‘‘సలాం మా నాన్నమ్మ మెడల్స్ అమ్మేశారు. ఆయన వల్ల ఆమె చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని ఫిరోజ్ చెప్పారు.
హమీదా బానోకు పెళ్లైందా?
అయితే, కల్యాణ్‌లో హమీదా ఉండే ఇల్లు చాలా పెద్దది. ఇలాంటివి మరికొన్ని ఇళ్లను కూడా ఆమె అద్దెకు తీసుకున్నారు. అద్దె పెరగడం, ఆదాయం తగ్గడంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి.‘‘సలాంతో గొడవలు మరింత ఎక్కువైనప్పుడు తనకు వచ్చే ఆదాయాన్ని మా అమ్మ దగ్గర దాచిపెట్టేది’’ అని రహీల్ చెప్పారు.అయితే, చివరి రోజుల్లో ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు.‘‘కల్యాణ్‌లోని తమ ఇంటికి పొరుగున్న ఒక మైదానం వెలుపల ఆమె బూందీ అమ్మడం మొదలుపెట్టారు’’ అని ఆయన తెలిపారు. ఆమెకు సలాం పహిల్వాన్‌తో వివాహమైందని ,కానీ, సలాం పహిల్వాన్ కుమార్తె సహారాతో మాట్లాడినప్పుడు, హమీదాను తల్లిగా చెప్పుకోవడానికి ఆమె నిరాకరించారు.హమీదా మీకు పిన్ని అవుతుందా? అని ప్రశ్నించినప్పుడు, మా నాన్నకు హమీదాకు పెళ్లైందని చెప్పారు.‘‘మగవారితో కుస్తీ పోటీల్లో పాల్గొనడం హమీదా తల్లిదండ్రులకు ఇష్టముండేది కాదు. అప్పుడే ఆమెను అక్కడి నుంచి సలాం తీసుకొచ్చేశారు. అలా ఆమె అలీగఢ్‌కు వచ్చారు’’ అని సహారా వివరించారు.‘‘మా నాన్న సాయంతోనే ఆమె గొప్ప రెజ్లర్‌గా మారారు. వారిద్దరూ కలిసే జీవించేవారు’’ అని తెలిపారు.అయితే, సలాంతో ఆమెకు పెళ్లికాలేదని ఆమె మనవడు ఫిరోజ్ అంటున్నారు.‘‘మా నాన్నను హమీదా దత్తత తీసుకున్నారు. అలా ఆమె నాకు నాన్నమ్మ అయ్యారు’’ అని ఆయన చెప్పారు.అయితే, ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. కుస్తీలో ఆమెను ఎవరైనా ఓడించినట్లు ఒక్క వార్త కూడా కనిపించలేదు.