Shweta Goankar: కొబ్బరి కల్లు శ్వేత…మార్చింది వేలాది మంది భవిత
గోవాలో ఓ యువతి వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఓ కొబ్బరి తోటలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమె ఓ రోజు చేసిన సాహసం ఆమె తలరాతను మార్చింది. ఆమెతో పాటు వేలాది మందికి ఉపాధి కలిగిస్తోంది. ఆమె పేరు శ్వేతా గోవాంకర్. బిఏ అగ్రికల్చర్ కోర్సు చేసిన ఆమె బెంగళూర్‌లో ఉద్యోగం చేసేది. కొంత కాలం బాగానే గడిచింది. కరోనా విజృంభణ సమయంలో ఉద్యోగం కోల్పోయింది. ఇంటికి వచ్చేసింది. సమీపంలో ఉన్న ఓ కొబ్బరి తోటలో మేనేజర్‌గా చేరింది.
మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమెకు ఓ రోజు కొబ్బరి చెట్టు ఎక్కాలని అనిపించింది. అనుకున్నదే తడవుగా చెట్టు ఎక్కింది. చెట్టు చివరకు చేరిన తర్వాత ఆమె కొబ్బరి కల్లు తీయడం గుర్తుకు వచ్చింది. వ్యవసాయంలో డిగ్రీ చేసిన ఆమె కల్లు తీసే విధానాన్ని గుర్తుకు తెచ్చుకుంది. ఆ మరుసటి రోజు నుంచి చెట్టు ఎక్కి కొబ్బరి కల్లు తీయడం ప్రారంభించింది. ఈ విషయం కొద్ది కాలంలోనే చుట్టు పక్కల గ్రామాలకు పాకింది. కొబ్బరి కల్లు తాగే వారి సంఖ్య పెరిగింది. తాటి కల్లు, ఈత కల్లులాగే కొబ్బరి కల్లుకు కూడా డిమాండ్ పెరగడం మొదలయింది. శ్వేతకు ఆదాయం మొదలయింది. కొన్ని నెలల తర్వాత ఆమె మరింత మందికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టింది. కేరళ నుంచి తెప్పించిన ఓ పరికరం ద్వారా మరికొంత మంది యువతులకు శిక్షణ ఇచ్చింది.
ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం
కొబ్బరి కల్లు తీయడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని గ్రహించిన చుట్టుపక్కల గ్రామాల యువతీ యువకులు కల్లు గీత కార్మికులుగా మారుతున్నారు. ఏడాదికి కసీనంలో కనీసం మూడున్నర లక్షల ఆదాయం వస్తుందని శ్వేత వారందరికీ వివరించింది. ఆమె స్పూర్తితో ఎంతో మంది ప్రస్తుతం కల్లు గీత ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. గోవాలో కల్లు గీస్తున్న తొలి మహిళగా శ్వేత గుర్తింపు పొందింది. ఆమెను ఎందరో పెద్దలు ప్రోత్సహించారు.
గోవాలో లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. కల్లు గీసే కార్మికుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. దాదాపుగా 200 మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కొబ్బరి కల్లు గీత కార్మికులకు అక్కడ డిమాండ్ బాగానే ఉంది. శ్వేత అందించిన సహకారంతో చాలా మంది ఏడాదికి మూడు లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు.