మనదేశంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య కోట్లలో ఉంది.
High BP : హైబీపీ లేదా హైపర్ టెన్షన్ (HyperTention)… ఈ రెండు ఒకటే. ఇది ఒక వ్యక్తి ఆరోగ్యం (Health) పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న ఒక రుగ్మత ఇది. అధిక రక్తపోటు (High BP) వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (Kidney) వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను, అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి. అయితే అధికరక్తపోటుతో బాధపడే వ్యక్తుల్లో మూత్రపిండాల్లో ఉండే రక్తనాళాలకు హాని కలుగుతుంది. వాటి పనితీరు దెబ్బతింటుంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
ధమనుల గోడలపై రక్తం స్థిరంగా ఒక క్రమ పద్ధతిలో ప్రవహిస్తే రక్తనాళాలపై ఎలాంటి ఒత్తిడి పడదు. అలా కాకుండా అది వేగంగా రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తూ ప్రవహిస్తున్నప్పుడు రక్తపోటు పెరుగుతుంది. అదే హైబీపీ. దీనివల్ల రక్తనాళాలు బిగుసుకుపోయి, ఇరుకుగా మారుతాయి. హైపర్ టెన్షన్ అధికంగా ఉన్న వారిలో మూత్రపిండ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవి కిడ్నీల వైఫల్యానికి కూడా దారి తీస్తుంది.
మూత్రపిండాల్లో నెఫ్రాన్స్ అని పిలిచే మైక్రోస్కోపిక్ రక్తనాళాలు ఉంటాయి. అవి రక్తం నుండి వ్యర్ధాలు అదనపు ద్రవాల్సి ఫిల్టర్ చేస్తాయి. కానీ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో ఈ నెఫ్రాన్సు దెబ్బతింటాయి. సరిగా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాలు ఇతర ముఖ్య అవయవాలకు నష్టం కలగవచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
1. మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉండాలంటే ముఖ్యంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.
2. ఉప్పు, కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు.
3. బరువు పెరగకుండా చూసుకోవాలి.
4. శారీరక శ్రమ అధికంగా ఉండేలా చూసుకోవాలి.
5. మద్యం, ధూమపానం మానేయాలి.