డెంగీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారొచ్చు
Dengue Fever : దోమ వల్ల వ్యాపించే ప్రాణాంతక జ్వరాల్లో డెంగ్యూ (Dengue) ఒకటి. కొందరికి ఈ జ్వరం (Fever)) వచ్చినట్టే వచ్చి తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రం తీవ్రంగా మారిపోతుంది. దీని వల్ల ప్లేట్ లెట్లు (Platelets) పడిపోవడం, రక్ (Blood) తం చిక్కగా మారడం జరుగుతుంది. సరైన కాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే డెంగ్యూని తేలికగా తీసుకోకూడదు.
డెంగ్యూ జ్వరం రావడానికి కారణం ఫ్లేవీ వైరస్. ఈ వైరస్లను ఆడ ఈడీస్ ఈజిప్ట్ దోమలు మోసుకొని తిరుగుతాయి. ఈ దోమ కుట్టడం వల్ల ఆ వైరస్ రక్తంలోకి ప్రవహిస్తుంది. దానివల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ మొదలయ్యాక మూడు నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ప్రాథమికంగా హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, తలనొప్పి, కళ్ళు నొప్పి, కళ్ళు ఎర్రబడడం, వాంతులు, వికారం, కీళ్ల నొప్పులు, ఆకలి వేయకపోవడం, చర్మం మీద ఎర్రటి దద్దుర్లు రావడం వంటివి కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను కలిసి రక్త పరీక్ష చేయించుకోవాలి. డెంగ్యూ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స చేయడం చాలా సులభం.
డెంగ్యూ జ్వరం ముదిరిపోతే పొట్ట ఉబ్బరం, పొట్టలో నొప్పి రావడం, తీవ్రంగా ఆయాస పడడం, రక్తపోటు పడిపోవడం, అపస్మారక స్థితిలోకి చేరడం, వాంతులు అవ్వడం, కాళ్లు చేతులు చల్లబడిపోవడం, చికాకు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతాయి.
జ్వరంలో అతి తీవ్రమైన లక్షణం ప్లేట్లెట్లు పడిపోవడం. ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం కూడా మనకి తెలియదు. రక్త పరీక్ష ద్వారా మాత్రమే ప్లేట్లెట్ల సంఖ్య తెలుస్తుంది. 50వేల కన్నా తక్కువ ప్లేట్లెట్లు ఉంటే ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. 20,000 కన్నా తగ్గితే ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తారు. అదే 10,000 కన్నా పడిపోతే వెంటనే దాత రక్తం నుంచి ప్లేట్ లెట్లు సేకరించి రోగి శరీరంలోకి ఎక్కించాల్సి వస్తుంది.
డెంగ్యూ జ్వరం ప్రాథమిక దశలో ఉంటే సాధారణ పారాసిటమాల్ మాత్రతోనే తగ్గుతుంది. డెంగ్యూ వచ్చాక ఎంతగా ద్రవాలు తీసుకుంటే అంతగా ఆ జ్వరం త్వరగా తగ్గుతుంది. ప్లేట్లెట్లు పడిపోతున్న క్రమంలో వైద్యులు సెలైన్ పెట్టి చికిత్స అందిస్తారు. ఏమైనా డెంగ్యూని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.