జిబోకి చెందిన ఝాంగ్ గత నెలలో తన పెళ్లి కోసం సొంతూరు వెళ్లినప్పుడు అక్కడ విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీని చూసి ఆశ్చర్యపోయారట.
Barbeque : తూర్పు చైనాలోని ఒక మామూలు పారిశ్రామిక నగరం ‘జిబో’.(zibo) అక్కడి జనాభా 47 లక్షలు. సాధారణంగా అలాంటి ఒక నగరాన్ని పర్యాటక ప్రదేశంగా చెప్పలేం. కానీ, జిబోకి చెందిన ఝాంగ్(jang) గత నెలలో తన పెళ్లి కోసం సొంతూరు వెళ్లినప్పుడు అక్కడ విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీని చూసి ఆశ్చర్యపోయారట.ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు ఝాంగ్(jang). కానీ, ఈసారి నా పెళ్లికి వచ్చే అతిథులకు స్పీడ్ ట్రైన్ టికెట్స్, హోటల్లో గదులు సిద్ధం చేస్తానని చెప్పలేకపోయాను. బార్బిక్యూ భోజనం కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది.
జనవరిలో చైనా(china) కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో జిబో (zibo)వెర్రి మొదలైంది. లాక్డౌన్ ఎత్తేయడంతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు లక్షల మంది చైనీయులు షాన్డాంగ్ రాష్ట్రంలోని జిబో నగరానికి క్యూలు కడుతున్నారు.అందుకు ప్రధాన కారణం మాత్రం బార్బిక్యూ భోజనం(Barbeque) అతి తక్కువ ధరకు దొరకడమే. కేవలం రెండు యువాన్లు, అంటే 24 రూపాయలకే స్కూయర్స్ ( స్టిక్స్‌కి గుచ్చి కాల్చిన ఆహారం) అమ్ముతున్నారు.జిబోలో జనం తమకు ఇష్టం వచ్చిన ఆహారం తింటూ, తాగుతూ కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భోజనం టేబుల్ చుట్టూ కొందరు డ్యాన్స్ చేస్తుండగా, మరికొందరు వెనక చిన్నచిన్న కర్రలు ఊపుతూ వారిని అనుకరిస్తున్న వీడియోలు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం షావోంగ్సులో దర్శనమిస్తున్నాయి.
”అక్కడ ఆరుబయట కారవోక్ సెషన్ జరుగుతుండగా. ప్రతి ఒక్కరూ తమకు నచ్చింది తింటూ, పాటలు పాడుతారు” అని వీడియో పోస్ట్ చేశారు. బార్బిక్యూ (Barbeque)ఆహారాన్ని చైనాలో అందరూ ఇష్టపడతారు. మరీముఖ్యంగా ఉత్తర చైనా, పశ్చిమ చైనాల్లో బార్బిక్యూ వంటకాలను చాలా ఇష్టంగా తింటారు. బార్బెక్యూలో మాంసం ముక్కలు, కూరగాయలను చెక్క స్టిక్కు గుచ్చి బొగ్గులపై కాలుస్తారు.మందంగా ఉండే పాన్‌కేక్‌తో ఉల్లికాడలు, చెక్క స్టిక్కు గుచ్చి కాల్చిన ఆహారాన్ని కలిపి తినేందుకు జిబో వాసులు ఇష్టపడతారట.కొందరు ఆన్లైన్ ఇన్ఫ్లూయెన్సర్లు జిబోని ”చైనా అవుట్డోర్ బార్బిక్యూ”(china outdoor Barbeque) అని పిలుస్తున్నారు. జిబో బార్బిక్యూ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పిన వివరాల ప్రకారం నగరంలో 1270కి పైగా బార్బిక్యూ రెస్టారెంట్లు ఉన్నాయి.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
”జిబో బార్బిక్యూ” అనేది గత మార్చి నుంచి చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ షావోంగ్సు, వీబోల్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఆ నెలలో, జిబోలో జనాభా దాదాపు రెట్టింపైంది. ఏప్రిల్ 29న రికార్డు స్థాయిలో జిబో రైల్వేస్టేషన్‌కి 87 వేల రైలు సర్వీసులు నడిచాయని చైనీస్ న్యూస్ వెబ్సైట్ కైగ్జిన్ తెలిపింది.మే నెల మొదటి వారంలో వచ్చే గోల్డెన్ వీక్ సెలవుల సందర్భంగా, దేశంలో హోటల్ గదుల ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్న నగరాల్లో జిబో కూడా ఒకటి. గోల్డెన్ వీక్ సెలవుల సమయంలో, దేశీయ పర్యాటక రంగం కరోనా మహమ్మారికి ముందు కంటే చైనాలో బాగా పుంజుకుంది. దాదాపు 27.4 కోట్ల పర్యటనలు జరిగినట్లు అంచనా. చైనా పర్యాటక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ఇది 2019 కంటే దాదాపు 20 శాతం ఎక్కువ.
జిబోకి అనూహ్యంగా పెరిగిన పర్యాటకుల రద్దీని అక్కడి అధికారులు అందిపుచ్చుకున్నారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలతో, సుమారు పది వేల మందికి ఆతిథ్యమిచ్చేలా రాత్రికి రాత్రే బార్బిక్యూ జోన్‌ను నిర్మించారు.
రైల్వేస్టేషన్లో ఉండే వాలంటీర్లు జిబోకి వచ్చే పర్యాటకులకు సూచనలు, సలహాలు ఇస్తారు. చిన్నారుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతారు. అలాగే మ్యూజియం పనిచేసే వేళలు వంటి తెలియజేస్తారు. అక్కడి నుంచి బస్సులు, రైళ్లలో బార్బిక్యూలు ఉండే ప్రాంతానికి చేరుకోవచ్చు.
అంత పాపులారిటీ ఎలా?
జిబో నగరానికి అనూహ్యంగా పాపులారిటీ రావడంపై అనేక వాదనలున్నాయి. సంవత్సరం క్రితం, దాదాపు పది వేల మంది యూనివర్సిటీ విద్యార్థులను క్వారంటైన్ కోసం జిబోకి తరలించారు. క్వారంటైన్ నుంచి విడిచిపెట్టిన తర్వాత అధికారులు వారికి బార్బిక్యూ విందు ఇచ్చారు. వసంత ఋతువులో మళ్లీ జిబో పర్యటనకు రావాలని వారిని ఆహ్వానించారు. వారిలో కొందరు ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. అలా వారి పర్యటన వివరాలకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు చైనీస్ సోషల్ మీడియా డూయిన్, దేశీయ యాప్ టిక్‌టాక్‌లో ట్రెండింగ్‌గా మారాయి.
అతి తక్కువ ధరలు కూడా విద్యార్థులను జిబో పర్యటనకు ఆకర్షిస్తున్నాయి. తక్కువ ఖర్చులో చిన్నచిన్న పర్యటనలు చేయాలనుకునే వారికి ఇది అవకాశంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ వల్ల కూడా జిబో పేరు మార్మోగింది. జిబోకు వెళ్లాలని నెటిజన్లు ట్యాగ్ చేసి మరీ కోరుతుండడంతో ‘స్పెషల్ ఉలాలా’ ఫుడ్ వ్లాగర్ కూడా డూయిన్లో పర్యటించారు. ఆ వీడియోలను తన వ్లాగ్‌లో పోస్ట్ చేశారు. ఆయన వ్లాగ్కి దాదాపు కోటి 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నెల రోజుల తర్వాత, రెస్టారెంట్లు చేసే మోసాలను బయటపెట్టే ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ జిబోకి వెళ్లారు. అక్కడ రెస్టారెంట్లలో అలాంటి దిగజారిన పరిస్థితులు లేవని ఆయన గుర్తించారు.
రావొద్దని వినతులు
అయితే, విపరీతంగా పెరిగిపోయిన పర్యాటకుల రాకపోకలను కొందరు నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు. రెస్టారెంట్ నిండిపోయిందని, మీకు భోజనం సరఫరా చేయలేకపోతున్నందుకు క్షమించాలంటూ ఒక రెస్టారెంట్ యజమాని మోకాళ్లపై కూర్చుని, పర్యాటకుడిని వేడుకుంటున్న వీడియో వీబోలో విపరీతంగా షేర్ అయింది.కస్టమర్ల తాకిడి కారణంగా రెస్టారెంట్లలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది రోజుకి కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. సెలవు రోజులలో పర్యాటకులు ఇక్కడకు రాకపోవడమే మేలని సూచిస్తూ జిబో సాంస్కృతిక, పర్యాటక శాఖ అధికారులు ఏప్రిల్ 26న ప్రకటన కూడా చేశారు. జిబోకి పర్యాటకుల తాకిడి ఎప్పుడూ ఇలాగే ఉండే అవకాశం లేదని, బార్బిక్యూ కేవలం వేసవిలో జరిగే కార్యక్రమం మాత్రమేనని ఝాంగ్ చెప్పారు. ”రానున్న రోజుల్లో ఇది చాలా కష్టం. ఇప్పటికి నగర జనాభా 50 లక్షలలోపే. అలాగే, బయటి నుంచి సగటున మరో 2 లక్షల మంది నగరానికి వస్తే వారికి ఆతిథ్యం కల్పించడం కూడా చాలా కష్టం.”
ఇప్పటికీ, చాలా మంది స్థానికులు పర్యాటకుల రాకపోకలపై సంతోషంగా ఉన్నారు. బయటి వ్యక్తులకు ఆతిథ్యం కల్పించేందుకు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఝాంగ్ అన్నారు. తమ సొంతూరు దేశవ్యాప్తంగా పర్యాటకంగా ప్రసిద్ధికెక్కడం గర్వంగా అనిపిస్తుందని ఆయన చెప్పారు.