Ayyakonda Village: ఆ ఊర్లో ఇంటింటికీ ఓ సమాధి ఎక్కడోతెలుసా?
Ayyakonda Village: ఏ ఊళ్ళో అయినా సమాధులను స్మశానంలోనే చూస్తుంటాం.. ఎక్కడయినా.. కర్మకాండ జరిపినప్పుడో..? వర్ధంతి రోజునో స్మశానానికి, సమాధుల మధ్యకు వెళుతుంటాం.. కానీ ఆ ఊర్లో ఇంటింటికీ ఓ సమాధి ఉండడం ప్రత్యేకత.. ఆ సమాధుల మధ్య జీవించాలంటే నిజంగా సాహసమే వాటి మధ్య జీవించకుంటే వారికి బతుకే లేదు. అయితే వాటి మధ్యే ఉంటూ ఇళ్లల్లో ఎలాంటి వంట చేసినా వారి ఇంటి ఎదుట ఉన్న సమాధికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.. సమాధికి నైవేద్యం సమర్పించిన తర్వాతే భోజనం చేయాలి లేకుంటే ఆ ఇంటి వారికి కీడు జరుగుతుందని వారి నమ్మకం. అందుకే ఆ గ్రామంలో ప్రతి ఇంటి ఎదుట సమాధి ఉండి తీరుతుంది. గుళ్లో దేవుడికైనా దండం పెట్టడం మరచి పోతారేమోకాని సమాధికి దండం పెట్టని రోజు ఉండదు. దానికి ఓ చరిత్ర కూడా ఉంది.
కర్నూల్ జిల్లాలోని గోనెగండ్ల మండలంలో అయ్యకొండ గ్రామం ఉంది. ఈ గ్రామంల్లోకి అడుగు పెట్టగానే ఇళ్ల ఎదుట సమాధులు దర్శనమిస్తాయి ఇక్కడకు వచ్చిన కొత్తవారు ఇళ్ల ముందు సమాధులు ఏంటని ఆశ్చర్య పోతుంటారు. అదే ఇక్కడి విశేషం ఎప్పుడో తాతల కాలం నుంచి వస్తున్న వింత ఆచార సంప్రదాయాలను ఈ గ్రామ ప్రజలు నేటికీ పాటిస్తూ.. అందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.. అయ్యకొండ గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు నివాసం ఉంటున్నారు..వీరి ఆచార వ్యవహారాలు చూసే వారిని ఆశ్చర్యపడేలా చేస్తాయి గ్రామంలో వెలిసిన చింతల మునిస్వామి వీరి దైవం.. దశాబ్దాల క్రితం తమ గ్రామంలో ఉండే ఓ బాబా చింతల మునిస్వామిని సేవిస్తూ గ్రామంలో జీవిస్తూ ఉండేవారట.. కాలక్రమేణా తొంబై ఏళ్ళ వయసులో మరణించాడట.. అందుకే అక్కడున్న గ్రామస్తులు భక్తితో ఆ బాబాను ఆరాధిస్తూ ఉంటారు. మరణించిన మునిస్వామికి ఆ గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించి సమాధిని నిర్మించారట.. అంతటితో ఊరుకోకుండా గ్రామంలో నివాసం ఉంటున్న వారందరూ తమ ఇళ్లల్లో ఏ ఆహార పదార్థం వండినా.. ముందుగా బాబా సమాధికి నైవేద్యం సమర్పించిన తర్వాతే గ్రామస్తులు ఆరగించాలని నియయం పెట్టారట.. దాంతో ఇక తమ ఇళ్లల్లో ఎవరు మరణించినా ఇంటి ముందే ఖననం చేసి, వారికి సమాధులు ఏర్పాటు చేశారు. వాటినే దేవాలయాలుగా భావిస్తూ నిత్యపూజలు చేస్తున్నారు.
ఇక ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా సమాధి వద్ద పూజ చేసి ఆ తర్వాత ఆ పని మొదలు పెడతారు.. ఈ సంప్రదాయం తమ పూర్వీకుల నుంచి వచ్చిందని దాన్ని పాటిస్తే పిల్లాపాపలు, పశువులు, పంటలకు మంచి జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఏదో రకంగా కీడు జరుగుతుందని వీరి నమ్మకం. ఆచారం పాటించని కుటుంబాలు కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాల్సిందేనని అంటారు. అటువంటి సందర్భాలు జరిగిన సంఘటనలను సైతం ఉన్నాయ్.. గతానికి ఇప్పటికీ గ్రామస్తుల్లో కొద్దిగా మార్పు వచ్చింది.. కుటుంబాల సంఖ్య పెరగడం, ఇళ్లు రెట్టింపు కావడంతో చనిపోయిన వారి మృతదేహాలను ఇండ్ల ముందు కాకుండా గ్రామ సమీపంలోనే ఖననం చేస్తున్నారు కానీ పండుగయినా పర్వదినమయినా, మామూలు రోజయినా.. ప్రతి రోజు వారికి సంబంధించిన సమాధులకు నైవేద్యం పెట్టడం మాత్రం సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది.