చాలామందికి నిద్రలేచాక ఒళ్లు నొప్పులు రావడం అనేది అనుభవమైన విషయమే.
Body Pains: కొంతమంది నిద్రలేచాక ఒళ్ళు నొప్పుల (Body Pains) బారిన పడతారు. అరగంట నుంచి గంట వరకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కండరాల నొప్పులు (Muscle pain) రావడం, తలనొప్పి (Headache)రావడం, శరీరం ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. కొంతమందికి ఇలాంటి సమస్యలు ఏవి రావు, కానీ కొంతమందిలో మాత్రమే ఇలా ఒళ్ళు నొప్పులు (Bodypains) వేధిస్తాయి. దీనికి కారణాలను వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు (Health Experts). ఇలా శరీరం ఉదయం లేచిన వెంటనే నొప్పులు పెట్టడానికి వారిలో ఉండే అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా కారణం కావచ్చు అని అంటున్నారు. అలాగే పరుపు శరీరానికి సెట్ కాకపోవడం, నిద్రా భంగిమలు సెట్ కాకపోవడం, అధిక బరువు పెరగడం, నిద్రా రుగ్మతలు ఉండడం కూడా ఈ ఒళ్లు నొప్పులకు కారణాలు కావచ్చు అని అంటున్నారు. అలాగే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
రక్తహీనత సమస్యతో బాధపడే వారిలో ఎక్కువగా ఇలా ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. శరీర కణజాలాలకి తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల శరీర భాగాలు అలసిపోయినట్లుగా అవుతాయి. అవి సరిగా పనిచేయలేవు. అప్పుడు ఒళ్లు నొప్పులు వస్తున్నట్లు అనిపిస్తుంది. అధిక బరువు పెరిగిన వారిలో కూడా ఒళ్ళు నొప్పులు అధికంగా వస్తాయి. వీరిలో నిద్రపోయినప్పుడు శ్వాస సమస్యలు వస్తాయి. ఇది నిద్రపై ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక బరువు వెన్ను, మెడపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల ఆ రెండు ప్రాంతాల్లో నొప్పి వస్తుంది. ఒళ్ళు నొప్పులు వచ్చేవారు బరువు తగ్గడం చాలా అవసరం.
నిద్రపోయే భంగిమ కూడా ఒళ్ళు నొప్పులను తెస్తుంది. కొంతమంది బోర్లా పడుకుంటారు. మరికొందరికి పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు. శరీరానికి సెట్ కాని భంగిమలో పడుకుంటే ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే తల దిండు సరిపోకపోయినా మెడ, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒళ్ళు నొప్పులు వస్తాయి. శరీరంపై ఒత్తిడి పడినప్పుడే ప్రతిచర్యగా ఒళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి మీ శరీరంలో ఏ భాగంపై నిద్ర పోయినప్పుడు ఒత్తిడి పడుతుందో గమనించండి. స్లీప్ ఫౌండేషన్ చెబుతున్న ప్రకారం వాడే పరుపు కూడా శరీర నొప్పులకు ప్రధాన కారణమే. పరుపు ఎగుడు దిగుడుగా ఉంటే ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం పెరుగుతుంది. నిద్ర కూడా పట్టదు. విటమిన్ డి లోపంతో బాధపడే వారిలో కూడా ఒళ్ళు నొప్పులు వస్తాయి. విటమిన్ డి లేనప్పుడు రక్తంలో కాల్షియం తగ్గుతుంది. మూత్రపిండాలు, కండరాలు, శరీరంలోని ఇతర అవయవాలు సరిగా పనిచేయలేవు. దీనివల్ల కూడా ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది. కాబట్టి నిద్రలేచాక మీకు ఒళ్లు నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పైన చెప్పిన సమస్యలో మీకు ఎలాంటివి ఉన్నాయో ఒక నిర్ధారణకు రండి. అలా వచ్చాక వాటికి చికిత్స తీసుకోవాలి. పోషకాహారాన్ని తింటూ, వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ప్రతిరోజూ ఒకే నిద్రావేళలను పాటించాలి. ఇలా చేయడం వల్ల ఒళ్లు నొప్పులు తరచూ రావడం అనే సమస్య తగ్గుతుంది.