TTD: హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు.. ఎన్ని కొట్లంటే?
TTD Hundi To create New Record In July Month: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిపై భక్తులు ఎంతటి ప్రేమ చూపిస్తుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఏడు కొండల వాడిని నిత్యం కొలుస్తుంటారు. అయితే..చాన్నాళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి దూరమైన భక్త కోటి.. స్వామిని దర్శించుకునేందుకు ఇప్పుడిప్పుడే ఏడు కొండలు ఎక్కుతోంది.
కొవిడ్-19 తీవ్రత తగ్గడమే కాక వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే తమ తిరుమల కోనేటిరాయుడికి కాసుల వర్షం కురిపిస్తున్నారు భక్తులు. జూలై మాసంలో కేవలం 21 రోజులకే 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటేసింది. 21 రోజుల్లో శ్రీవారికీ హుండీ ద్వారా 100కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మాసంలో స్వామి వారికి టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయిలో ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు గత మే నెల్లో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండి ఆదాయం కాగా ఇప్పుడు 21 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకోవడంతో ఈసారి ఆ మార్కు కూడా దాటే అవకాశం కనిపిస్తోంది. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికీ లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా సుమారు వారం రోజులు ఉండడంతో ఈ వారం కూడా హుండీ ఆదాయం ఎంత వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.