ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత.. కేతు విశ్వనాథరెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.
దివికేగిన సాహితీ శిఖరం
Kethu Viswanatha Reddy: ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత.. కేతు విశ్వనాథరెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన కేతు.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంటున్న కూతురి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా..ఫలితం దక్కలేదు. ఆయన అంత్యక్రియలను ఈ నెల 24న (Funeral on 24th of this month) నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కేతు విశ్వనాథరెడ్డి కుమారుడు విదేశాల్లో ఉండటంతో.. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విశ్వనాథ రెడ్డి భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఆమెను చికిత్సకు తీసుకువచ్చి.. ఆమె ఆస్పత్రిలో ఉండగానే ..విశ్వనాథరెడ్డి మృతి చెందడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేతు విశ్వనాథరెడ్డి (Kethu Viswanatha Reddy) జూలై 10, 1939న వెంకట రెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచీ అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. జీఎన్ రెడ్డి పర్యవేక్షణలో కడప జిల్లా ఊర్ల పేరు కోసం పరిశోధన చేశారు. అలా 1976లో తొమ్మిది అధ్యయనాలతో గ్రంథం రాసారు. అందులో జిల్లా చారిత్రక పరిణామాన్ని చక్కగా వివరించారు. విశ్వనాథరెడ్డి.. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా పనిచేసి… పదవీ విరమణ చేశారు.
కేతు విశ్వనాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘానికి.. పూర్వ అధ్యక్షుడిగా పనిచేశారు. అలా ఆయన కడప జిల్లాలో సవ్యశాచి పత్రిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆయన రచనలకు 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Central Sahitya Akademi Award) లభించింది. తనదైన శైలిలో అభ్యుదయ రచనలతో పాఠకలోకానికి దిశా నిర్ధేశం చేసిన కేతు విశ్వనాథరెడ్డి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తన రచనలతో ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. .
తెలుగు సాహిత్య చరిత్రలో 1980లో యుగ విభజన మీద చర్చ జరిగినప్పుడు ఆయన ఆలోచనలు ఎందరికో స్ఫూర్తిని నింపాయి. ఎంతోమందిని ఆయనకు అభిమానులుగా మారేలా చేశాయి. అంతేకాదు తెలుగు సాహిత్యాన్ని.. లిఖిత సాహిత్య చరిత్రగా మాత్రమే అంతా భావించడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. క్రీస్తు పూర్వం1000 వ సంవత్సరం నుంచి…క్రీస్తు పూర్వం 600 వ సంవత్సరం వరకూ వ్యవసాయక పూర్వ యుగమని.. అప్పటి నుంచి క్రీస్తు శకం 1800 వరకూ వ్యవసాయక యుగమని, ఆ తర్వాత పారిశ్రామిక యుగమని విభజించడమే కాదు.. ప్రతీదానికి సరైన కారణాలను వివరించారు.
వాటిలో ఒక్కొక్క దానిలో ఉపదశలో ప్రాంతీయ బేధాలు, ధోరణులు ఉన్నాయని.. వీటి అవిచ్చినత చరిత్రే.. తెలుగు సాహిత్య చరిత్ర అని నిర్ధారించారు కేతు విశ్వనాథరెడ్డి. అలాంటి సాహితీ సౌరభాన్ని కోల్పోయినందుకు సాహితీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.