కేరళలో ఆరెస్సెస్ కు చుక్కెదురైంది.. దేవాలయాల్లో ఆ పరిసరాల్లో RSS డ్రిల్స్ చేయడానికి వీలులేదని ట్రావెన్కూర్ దేవాలయాల బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. దీనితో కేరళ దేవాలయాల నుంచి rss బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.
RSS BAN IN KERALA TEMPLES : కేరళ (Kerala)లోని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) సంచలన నిర్ణయం (Desicion) తీసుకుంది బోర్డు పరిధిలోని కేరళ దేవాలయాల్లో (Temples) ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) తన పరిధిలో ఉన్న త్తం 1248 ఆలయాలకు సర్క్యులర్లు జారీ చేసింది. ఆలయాల్లో కేవలం మతపరమైన పూజలు, కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని పేర్కొంది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు లేదా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శాఖకు అనుమతి ఇవ్వకూడదని స్ఫష్టం చేసింది. ఆదేశాలను పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.
గతంలోనే…
ఆలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ ఆయుధ శిక్షణను నిషేధిస్తూ 2016లో ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. తర్వాత మార్చి 30, 2021న, మళ్లీ సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఆర్డర్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే, ఆలయ ప్రాంగణాన్ని ఆచారాలు , పండుగలకు మినహా మరే ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని సర్క్యులర్ నిషేధించింది. ఆదేశాల తరువాత కూడా రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బోర్డు గుర్తించడంతో మే 18న తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
పూజలకే పరిమితం
ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు మినహా మరే ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్, ఏ సంస్థ రాజకీయ పార్టీలకు అనుమతి లేదని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలను నిషేధించి ప్రధాన కార్యాలయానికి నివేదించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు అధికారులను కోరారు. ఆ తర్వాత కూడా దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే సామాన్యులు కూడా బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
విపక్షాలేమంటున్నాయి
కాంగ్రెస్ నేత, సభలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు ఆదేశాలను సమర్థించారు. సర్క్యులర్‌కు తాను కూడా మద్దతిస్తున్నానని ఆయన అన్నారు. 2021లో కూడా అలాంటి సర్క్యులర్ జారీ చేసినా ఆర్ఎస్ఎస్ దానిని ఉల్లంఘించిందనీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందనీ, ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోందని ఆరోపించారు. ఆలయ ప్రాంగణాన్ని అలాంటి పనులకు ఉపయోగించకూడదనీ, ఇది చాలా పవిత్రమైన ప్రదేశమని తెలిపారు.
ఎందుకీ నిర్ణయం
కేరళలో బలపడేందుకు ఆర్ ఎస్ ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు దేవాలయాలను వేదికగా ఉపయోగించుకుంటోంది. ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేరళలో దాదాపు 90% మంది హిందువులు సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ఉన్నారని కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీశన్ అన్నారు. అందుకే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి కార్యకలాపాలపై నిషేధం సరైనదేనని పేర్కొన్నారు. ఆలయాల లోపల అన్ని రకాల డ్రిల్లు, ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలన్నారు. దేవాలయాలు భక్తుల ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. తాజా నిర్ణయంలో అయినా ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలను ఆలయాల్లో కాకుండా ఇతర చోట్ల నిర్వహించుకుంటుందో లేదో వేచి చూడాలి.