రాజస్థాన్ రాజకీయాలు ఎన్నికల వైపు పరుగులు తీస్తున్నాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టిన సీఎం గెహ్లాట్ ఎన్నికల వరాలతో ముందుకెళుతున్నారు.
Rajasthan Politics:అంతర్గత రాజకీయాలతో సతమవుతూనే రాజస్థాన్ సీఎం ఎన్నికల వ్యూహరచన మొదలుపెట్టారు. ఈ ఏడాది చివరలో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి, అధికారం నిలుపుకోవాలనే గట్టి సంకల్పం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతోనే బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ అస్త్రాన్ని రాజస్థాన్‌లో ముందుగానే ప్రయోగించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తదుపరి 100 యూనిట్ల వరకు స్థిరమైన శ్లాబు రేటు కొనసాగించనున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎన్నికల శంఖరావాన్ని అజ్మేర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మర్నాడే కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గతేడాది డిసెంబరు తర్వాత రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అతి పెద్ద ప్రకటన ఇదే. వంటగ్యాస్‌పై భారీ సబ్సిడీని ప్రకటించిన సీఎం గెహ్లాట్.. రూ.500లకే సిలిండర్ అందజేస్తామని అప్పుడు ప్రకటించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందజేసే ఆరోగ్య బీమా పథకానికి గతేడాది శ్రీకారం చుట్టారు. సామాజిక భద్రత పథకం కింద అందజేసే పెన్షన్లను రూ.1,000కి పెంచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలోని ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌కి భారీ విజయాన్ని అందించిన ఉచిత విద్యుత్, తాగునీరు వాగ్దానం కర్ణాటకలో కూడా కాంగ్రెస్‌కు పని చేసింది.
వివాదాలు సమసినట్టేనా?
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలెట్ (Sachin Pilot) మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలుమాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గత ప్రభుత్వ అవినీతి కేసులపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని సచిన్ పైలెట్ పునరుద్ఘాటించారు. తాను ఇప్పటికే అల్టిమేటం ఇచ్చానని, ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై తాను నిర్ణయం తీసుకుంటానని సచిన్ పైలట్ తెలిపారు. ఈ మధ్య ఢిల్లీ సమావేశంలో సంధి కుదిరినా మళ్లీ సచిన్ పైలట్ ఇలా సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేయటం పలు అర్ధాలకు దారి తీస్తోంది.
సహనం ఉండాలన్న గెహ్లాట్…
ఢిల్లీలో అధిష్ఠానంతో సమావేశానంతరం గెహ్లాట్ సైతం ఈ ఏడాది చివర్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను, పైలట్ కలిసి పని చేస్తామని, ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సహనంతో కష్టపడి పనిచేయాలని, భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుందని సోనియాగాంధీ కాంగ్రెస్ కన్వెన్షన్‌లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.