Nitish Kumar: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని (BJP) గద్దె దించడమే లక్ష్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) విపక్ష నేతలను ఏకం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలతో సమావేశమయ్యారు.
Nitish Kumar: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని (BJP) గద్దె దించడమే లక్ష్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) విపక్ష నేతలను ఏకం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలతో సమావేశమయ్యారు. తాజాగా ఆదివారం ఢిల్లీకి వెళ్లిన నితీశ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో (Arvind Kejriwal) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, పార్టీ నేతలు సంజయ్ ఝా, మనోజ్ ఝాలు కూడా పాల్గొన్నారు.
పాలనావ్యవహారాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై అందరం కలిసి పోరాడుతామని నితీశ్ కుమార్ అన్నారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆప్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నానని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలనన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కతాటిపైకి వస్తే ఢిల్లీలోని గ్రూప్-ఏ అధికారుల నియామకం, బదిలీలపై సుప్రీం తీర్పునకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవచ్చని నితీశ్ కుమార్ వెల్లడించారు. ఇదే జరిగితే ఎన్నికలకు ముందు సెమీఫైనల్లా అవుతుందని.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందదనే సందేశం దేశమంతటా వెళ్తుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఢిల్లీ ప్రజలకు అండగా ఉంటామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ భరోసా ఇచ్చారని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తమ ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ప్రకటించారని వెల్లడించారు.