కొందరికి ప్రయాణం అంటే చాలు వికారం మొదలైపోతుంది.
Motion Sickness: చాలామందికి బస్సు ఎక్కిన వెంటనే వికారం (Nausea) మొదలవుతుంది. కొందరికి కార్లు, విమానాలు కూడా పడవు. తల తిప్పడం, పొట్టలో తిప్పినట్టు అనిపించడం, వికారం మొదలవడం, చివరికి వాంతులు (Vomitings) అవ్వడం జరుగుతుంది. అందుకే ప్రయాణం (Travelling) అంటేనే భయపడిపోయేవారు ఎంతోమంది. దీన్నే మోషన్ సిక్నెస్ (Motion Sickness) అంటారు. అలాగే కైనేటోసిస్ అని కూడా పిలుస్తారు. ప్రయాణంలో వాంతులు అవ్వడం అనేది సర్వసాధారణం. అలా అని అందరికీ ఈ పరిస్థితి రావాలని లేదు. కొంతమందిలో మాత్రమే ఈ మోషన్ సిక్నెస్ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం కళ్ళు, చెవులు, మెదడు మధ్య సమన్వయం లోపించడమే. కళ్ళ నుంచి చూసేది, చెవి నుంచి వినేది సమన్వయం కుదరనప్పుడు మెదడులో సమాచారం గజిబిజిగా ఉంటుంది. దీనివల్ల వికారంగా అనిపిస్తుంది. లోపలి చెవిలో ఎండోలింపు అనే ద్రవం ఉంటుంది. అదే మనం కదులుతున్న విషయాన్ని గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. ఒక్కోసారి కళ్ళ నుంచి మనం ప్రయాణిస్తున్నా కూడా…ఆ కదలికసమాచారం మెదడుకు అందదు. దీని వల్ల మెదడు కూడా తికమక పడుతుంది. అప్పుడు వాంతి, వికారంచ ఒత్తిడి, ఆందోళన, హఠాత్తుగా నీరసించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ప్రయాణంలో వాంతులు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. కారు, బస్సు వంటి వాటిలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ ముందు సీట్లోనే కూర్చోవాలి. అలా ముందు సీట్లో కూర్చోవడం వల్ల ముందువైపు జరిగేవన్నీ కళ్ళు చూస్తాయి. చెవి వింటుంది. ఈ రెండు సమన్వయంగా పనిచేసి మెదడుకు సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి సమాచారంలో ఎలాంటి తేడా ఉండదు. మెదడు గజిబిజి పడే అవకాశం ఉండదు. దీనివల్ల మోషన్ సిక్ నెస్ రాకుండా ఉంటుంది.
2. విమానాల్లో ప్రయాణించే వాళ్ళు కిటికీ పక్కన కూర్చోవడం చాలా ఉత్తమం. వీలైతే కళ్ళు మూసుకొని నిద్రపోవాలి.
3. ప్రయాణానికి ముందు కెఫీన్ అంటే కాఫీలు తాగడం, టీలు తాగడం మానేయాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం వంటివి చేయకూడదు.
4. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. అలా అని ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. గంటకోసారి గుక్కెడు నీళ్లు తాగుతూ ఉండాలి.
5. అల్లం, నిమ్మ వాసన వంటివి వికారాన్ని తగ్గిస్తాయి. కాబట్టి నిమ్మకాయలను చేత్తో పట్టుకొని వాసన పీలుస్తూ ఉండాలి. నిమ్మ రసం రుచిని చూస్తూ ఉండాలి. అలాగే అల్లంలో కూడా వికారాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అల్లం రుచి ఉన్న చాక్లెట్లు తినడం మంచిది.
6. డాక్టర్ సలహాలు తీసుకొని ప్రయాణానికి ముందు వాంతిని ఆపే మాత్రలు తీసుకోవడం కూడా మంచిదే.